Breaking News Live Telugu Updates: రేపు గొల్లప్రోలులో సీఎం జగన్ పర్యటన, పూర్తి షెడ్యూల్ ఇదీ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీరంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కొమొరిస్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడింది. తూర్పు రాజస్థాన్ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్ గఢ్, ఏపీలోని కోస్తా ప్రాంతం మీదుగా ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల, 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగి బలహీనపడింది. భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో జూలై 30 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలో భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి బువనగిరి, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, భారీ వర్షాల సమయంలో వాగులు, వంకల ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించకూడదని ప్రజలను అధికారులు, మంత్రులు హెచ్చరించారు. వర్షాలు పడుతున్నాయని రైతులు పొలం పనులు వేగవంతం చేశారు. కొన్ని చోట్ల వ్యవసాయ పనులకు వర్షం ఆటకం కలిగిస్తోంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల పిడుగులు పడే పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలలో సైతం పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు ఉండగా, రాయలసీమకు ఎలాంటి వర్ష సూచన లేదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావం రాయలసీమపై లేదు. కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలలో చలి గాలులు వీస్తాయి.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
Asifabad District: వాగులో కారు గల్లంతు, డ్రైవర్ సేఫ్
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని అంద్ గూడ, కెరమెరి మండలం అనార్ పల్లి గ్రామాల మధ్యలో గల వాగులో కారు గల్లంతయ్యింది. కెరమెరి మండలం అనార్ పల్లికి చెందిన రాజేష్ అంద్ గూడ వైపు నుండి అనార్ పల్లికి వస్తున్న క్రమంలో భారీ వర్షం కురిసింది. దీంతో అంద్ గూడ, అనార్ పల్లి గ్రామాల మధ్య ఉన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో, ప్రవాహం తక్కువగా ఉందనే భావనతో డ్రైవర్ కారును వాగు దాటించే ప్రయత్నం చేయగా.. నీటి ప్రవాహానికి కారు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. అప్రమత్తమైన డ్రైవర్ రాజేష్ కారు నుంచి దూకడంతో, తృటిలో ప్రాణ ప్రాయం నుండి అతడు బయటపడ్డాడు. డ్రైవింగ్ చేస్తున్న రాజేష్ చాకచక్యంగా కారు నుండి బయట దూకెయ్యడంతో ప్రమాదం నుండి బయటపడ్డాడు. వరద నీటిలో కారు కిలోమటర్ దూరం వరకు కొట్టుకుపోయింది. డ్రైవర్ రాజేష్ వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించడంతో గ్రామస్తులు కరంజివాడ వెళ్ళే దారిలో కారును గుర్తించి బయటికి లాగారు.
CM YS Jagan Tour: సీఎం వైయస్ జగన్ కాకినాడ జిల్లా గొల్లప్రోలు పర్యటన రేపు
- వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం బటన్ నొక్కి విడుదల చేయనున్న సీఎం
- ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం
- 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకోనున్న జగన్
- 10.45 – 12.15 గంటల వరకు బహిరంగ సభ ప్రాంగణంలో సీఎం ప్రసంగం
- వైఎస్సార్ కాపు నేస్తం పథకం సహాయం విడుదల కార్యక్రమం
- మధ్యాహ్నం 12.40 గంటకు అక్కడి నుంచి తిరుగు పయనం
- 1.30 గంటలకు తాడేపల్లి చేరుకోనున్న సీఎం





















