Breaking News Live Telugu Updates: నేడు కేంద్ర, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రులు తిరుపతికి! షెడ్యూల్ ఇదీ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా సాయంత్రం నుంచి రాత్రి వేళలో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. అక్టోబర్ 20న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆపై ఇది అక్టోబర్ 22న తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. తెలంగాణలో నేడు మోస్తరు వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీలో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని ఎల్లో వార్నింగ్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈశాన్య రుతుపవనాలు త్వరలో ఏపీలోకి ప్రవేశించనున్నాయి. నేడు సైతం పలు జిల్లాలకు వర్ష సూచనతో అమరావతి వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురువనున్నాయి. భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. తూర్పు దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
నల్గొండ, నాగర్ కర్నూలు, యాదాద్రి భువనగిరి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదైంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
తీరంలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, వీటి వేగం 55 కిలోమీటర్లు దాటే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అక్టోబర్ 20 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం సురక్షితం కాదని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో నేడు అక్కడక్కడ వర్షాలున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడెపల్లిగూడంతో పాటుగా పలు ప్రాంతాలతో కురుస్తున్న భారీ వర్షాలు నేరుగా ఏలూరు జిల్లాలోకి విస్తరిస్తున్నాయి. నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వానలున్నాయి. అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అక్టోబర్ 20న బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం ఏర్పడుతుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. విజయవాడ నగరం పశ్చిమ భాగాల్లో కురుస్తున్న వర్షాలు గుంటూరు జిల్లాలోకి ప్రవేశించనున్నాయి. గుంటూరు - తెనాలి పరిధితో పాటు కృష్ణా జిల్లాలోని గుడివాడ పరిసర ప్రాంతాలల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు జిల్లాతో పాటు ఎన్.టీ.ఆర్. జిల్లాల్లో గాలుల సంఘమం కొనసగుతోంది కాబట్టి అర్ధరాత్రి వరకు వర్షాలున్నాయి. పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రాయలసీమ జల్లాల్లోని కొన్ని ప్రదేశాల్లో మాత్రమే వర్షాలు పడతాయి. చిత్తూరు టౌన్ తో పాటుగా చుట్టుపక్కనే ఉన్న పాకాల, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది.
Sameer Sharma IAS: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మకు అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అశ్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఆయన కొద్దిపాటి అస్వస్థతకు గురై స్థానిక ఆసుపత్రిలో చేరి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఆయన హైదరాబాదులోని ఒక ప్రవేట్ ఆసుపత్రిలో చేరగా గుండె సంబంధిత చికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కొద్ది రోజుల్లో ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సీఎస్ సమీర్ శర్మ ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయి త్వరలో విధుల్లో చేరే అవకాశం ఉంది.
Nirmala Sitaraman: నేడు కేంద్ర, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రులు తిరుపతికి! షెడ్యూల్ ఇదీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈనెల 19, 20 , 21 తేదీలలో చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 1:45కు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, తిరుపతిలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం 5.00 గంటలకు కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకుని తిరుమల చేరుకొని రాత్రి బస చేస్తారు. 21న ఉదయం తిరుమల శ్రీవారిని, 10.30 గంటలకు శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్లను దర్శించుకుని మధ్యాహ్నం 2 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పర్యటన వివరాలు
బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి స్వాగతం పలకనున్నారు. అదే రోజు తిరుమలలో బస చేసి , ఈనెల 20న గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, తిరుపతిలో జరగనున్న టాక్స్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొని తిరుమలలో బస చేస్తారు. 21న ఉదయం మరోమారు శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో కేంద్ర మంత్రికి వీడ్కోలు తెలిపి తిరుగు ప్రయాణం కానున్నారు.