Breaking News Live: కడపలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 21న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు" పేరుతో 36 గంటల పాటు దీక్ష చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం, జిల్లా కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మూక దాడికి వ్యతిరేకంగా ఈ దీక్ష చేపట్టనున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు 36 గంటల వరకు మంగళగిరిలో కేంద్ర పార్టీ ఆఫీసులో దీక్ష చేయనున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం పేట్రేగిపోతోందని.. ఫ్యాక్షనిజానికి అధికారం తోడయ్యిందని చంద్రబాబు భావిస్తున్నారు. దీనిలో పోలీసులు అంతర్భాగమయ్యారని.. ప్రశ్నించిన వారిని భౌతికంగా అంతమొందించే ఉన్మాద, మూక దాడులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరతీశారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజమేనని.. ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయంపై మూక దాడి చేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదని గుర్తు చేస్తున్నారు. ముందస్తు కుట్రతో పార్టీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేసి.. కుటుంబ సభ్యులు ప్రాణభయంతో వణికి పోయేలా దాడులకు తెగబడ్డారని టీడీపీ మండిపడింది. ప్రభుత్వ ఉగ్రవాదాన్ని నిలువరించాల్సిన బాధ్యత ప్రతి రాష్ట్రంలోని ప్రతి పౌరునిపై ఉందని టీడీపీ పిలుపునిచ్చింది. ప్రజలు, ఇతర ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సంఘాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఇతర పార్టీల నేతలు పరిశీలించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పరిశీలించి.. పథకం ప్రకారమే దాడులు చేశారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆఫీసులు, నాయకులపై దాడులు అనుకోకుండా జరిగినవి కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ చూడలేదని.. ఇలా జరగటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో డీజీపీ కార్యాలయం ఉందని అయినా అడ్ుడకోలేదంటే కచ్చితంగా పోలీసుల ప్రోద్బలం ఉందని రామకృష్ణ ఆరోపించారు. గత రెండేళ్ల నుంచి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు.
మరో టీడీపీ ఆఫీసు వద్ద కూడా బుధవారం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వారిని అంబులెన్స్‌లలో టీడీపీ ఆఫీసుకు తీసుకొస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ ఆఫీసులోకి వెళ్లడానికి వీల్లేదన్నారు. అయితే విషయం తెలుసుకుని లోకేష్ రోడ్డు మీదకు రావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అంబులెన్స్‌ను వదిలి పెట్టారు. గురువారం చంద్రబాబుతో పాటు వారు కూడా దీక్షలో కూర్చునే అవకాశం ఉంది.
దీక్ష తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. హోంమంత్రి అమిత్ షాని కలిసి ప్రభుత్వ టెర్రరిజంపై ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. దాడి విషయం ఇంకా తన దృష్టికి రాలేదని పార్టీ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. దీంతో నేరుగా కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఎల్లుండి సీఎం జగన్ విశాఖ పర్యటన
శనివారం విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఎన్‌ఏడీ ఫ్లైఓవర్, వుడా పార్కులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి సీఎం హాజరుకానున్నారు.
కడపలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి
కడప జిల్లా మైదుకూరు మండలం ఆదిరెడ్డిపల్లె వద్ద ఘోర ప్రమాదం జరిగింది. జేసీబీ అదుపుతప్పి కూలీల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులంతా కేసలింగాయపల్లె గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పొలం పనులకు వెళ్లి ఆటో కోసం వేచి ఉన్న కూలీలను జేసీబీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. జేసీబీ డ్రైవర్ మద్యం మత్తులోఉన్నట్లు స్థానికులు అంటున్నారు.
బంగారం కోసం బామ్మనే హత్య చేశాడు
చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం రంగారెడ్డిపల్లి గ్రామంలో కాంతమ్మ(70) అనే వృద్ధురాలిని ఈనెల 6వ తేదీన గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆమె కుమారుడు దేవులపల్లి మల్లిరెడ్డి రొంపిచర్ల పోలీస్ స్టేషన్ లో కాంతమ్మను ఎవరో గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. కాంతమ్మ ఒంటిపై ఉన్న బంగారు నగల కోసం రంగారెడ్డిపల్లికి చెందిన దేవులపల్లి మల్లిరెడ్డి కుమారుడు దేవులపల్లి ప్రకాష్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు..
చిర్రయానం బీచ్ లో యువకుడు గల్లంతు
తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం చిర్రయానం బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లి యువకుడు గల్లంతయ్యాడు. సముద్ర స్థానానికి వెళ్లిన నలుగురిలో ముగ్గురు అలల ఉద్ధృతికి కొట్టుకొని పోతుండగా ఇద్దరిని స్థానిక మత్స్యకారులు కాపాడారు. అలల ఉద్ధృతికి యువకుడు కొట్టుకుపోయాడని స్ధానిక మత్యకారులు తెలిపారు. సముద్రంలో గల్లంతైన యువకుడు గచ్చకాయలపోర గ్రామానికి చెందిన మల్లాడి బాలయేసు(18) గా తెలుస్తోంది. గల్లంతైన బాల యేసు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
దాడులపై గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు
రాష్ట్రంలో రెండు రోజులుగా జరిగిన ఘటనపై టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో నేతల బృందం గవర్నర్ ను కలిశారు.