AP Rains: రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే... వరదలపై ప్రధాని మోదీ ఆరా
ఏపీలో భారీ వర్షాలపై ప్రధాని మోదీ సీఎం జగన్ కు ఫోన్ చేశారు. వరదలపై ప్రధాని ఆరా తీశారు. వరద ప్రభావిత జిల్లాలో రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే చేయనున్నారు.
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల కురుస్తున్నాయి. సీఎం జగన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రధాని ఆరా తీశారు. వర్షాల ప్రభావం ఉన్న జిల్లాల పరిస్థితిపై ప్రధాని మోదీకి సీఎం జగన్ వివరించారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పరిస్థితిపై సీఎం జగన్ వివరించారు. వరద ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలను తెలిపారు. సహాయ చర్యలకు నేవీ హెలికాప్టర్లు వాడుకుంటున్నట్లు సీఎం జగన్ చెప్పారు. వరద సహాయక చర్యల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున సాయం అందించేందుకు ప్రధాని మోదీ సీఎంకు భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ysjagan గారి తో మాట్లాడడం జరిగింది. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చాను. ఈ సమయంలో అందరూ సురక్షితంగా, భద్రంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) November 19, 2021
సీఎం జగన్ ఏరియల్ సర్వే..
రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శనివారం సీఎం జగన్ ఏరియల్ సర్వే చేయనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. రేపు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప చేరుకోనున్న సీఎం జగన్.. కడప, చిత్తూరు, నెల్లూరు సహా ఇతర ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు.
Also Read: రాజంపేట లో నీటిలో కొట్టుకు పోయిన ఆర్టీసీ బస్సు
కడప జిల్లాలో భారీ వర్షాలు
కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా రాజంపేటలో భారీ ప్రాణ నష్టం జరిగింది. దాదాపు 30 మంది వరదలో కొట్టుకు పోగా ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలను వెలికితీశారు. నందలూరు పరివాహక ప్రాంతంలోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతాల్లో 3 ఆర్టీసీ బస్సులు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులోని కండక్టర్, ఇద్దరు ప్రయాణికులు వరదలో కొట్టుకుపోయారు. వరద ఉద్ధృతికి కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరగడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటు ఉన్నారు.
Also Read: తీరం దాటనున్న వాయుగుండం.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. మత్స్యకారులకు హెచ్చరిక!