YS Jagan : వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ఆగిపోయిందా ? - ఇదిగో పోలీసులు ఇచ్చిన క్లారిటీ
Andhra Pradesh : వైఎస్ జగన్ కు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోలేదని పోలీసులు ప్రకటించారు. అయితే పోలీసులు పాత వాహనం ఇచ్చారని అది ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతోందని వైసీపీ ఆరోపించింది.
YS Jagan Bullet proof vehicle : వైఎస్ జగన్ వినుకొండ పర్యటనకు వెళ్లేటప్పుడు పోలీసులు కల్పించిన భద్రతా వాహనాలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. మాజీ సీఎంగా ఆయనకు జడ్ ప్లస్ భద్రత కల్పించారు. అందులో భాగంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు. తాడేపల్లిలోని ఇంటి దగ్గర నుంచి ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో బయలుదేరిన జగన్ మోహన్ రెడ్డి పది కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మంగళగిరి వద్ద ప్రైవేటు టోయోటా ప్రాడో వాహనంలోకి మారారు. అయితే కారు బ్రేక్ డౌన్ అయిందని అందుకే జగన్ కారు మారారని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలోనూ అదే ఆరోపణలు చేశారు.
వినుకొండ వెళ్తూ మార్గ మధ్యలో మంగళగిరి వద్ద, ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో, ఆ వాహనం దిగి మరో వాహనంలో ముందుకు వెళ్లిన శ్రీ @ysjagan గారు. pic.twitter.com/IluUawgEgN
— YSR Congress Party (@YSRCParty) July 19, 2024
జగన్ భద్రతపై నిర్లక్ష్యం చేస్తున్నారని పాత వాహనాలు ఇచ్చారని ఆరోపణలు చేశారు. వాహనాలు ఆగిపోవడంతో పర్యటన ఆలస్యమయిందని ఆరోపణలు గుప్పించారు. వైసీపీ సోషల్ మీడియా, మీడియా ఇలాంటి ఆరోపణలు చేసింది. అధికారికంగా పోలీసు శాఖకు జగన్ భద్రతపై ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు.
బుల్లెట్ ప్రూఫ్ వాహనం కాన్వాయ్‌తో పాటే ఉందని పోలీసుల ప్రకటన
కానీ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పోలీసు శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. జగన్‌కు ప్రస్తుతం జడ్ ప్లస్ సెక్యూరిటీకి ఇచ్చే భద్రత ఉందని పోలీసు శాఖ తెలిపింది. వాహనం ఫిట్‌నెస్‌పై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవాల్లేవని . జగన్‌కు కేటాయించి వాహనం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉందని కండిషన్ చూసిన తరువాతనే వీఐపీకి కేటాయించామన్నారు. జగన్ కు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోలేదని.. జగన్ కారు దిగిన తరువాత అదే కాన్వాయ్‌లో ఆ వాహనం వెళ్లిందని, ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు చెప్పారు. ఆ వాహనంకు ట్రబుల్ ఇస్తే అక్కడే ఉండాలని కానీ అది జగన్ కాన్వాయ్ తో పాటే ఉందన్నారు.
వాహనాలను ఆపామన్నది కూడా అబద్దమని పోలీసుల ప్రకటన
ర్యాలీలకు, సభలకు అనుమతి లేదని.. జగన్ వెళ్లే పరామర్శ కార్యక్రమానికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వినుకొండ వెళ్తున్న జగన్ కాన్వాయ్‌లోని ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేల వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీసులు ఆపేసినట్లు వైసీపీ నేతలు విమర్శలు చేశారు. అయితే ఏ వాహనాన్ని ఆపలేదని అన్ని వాహనాలు వినుకొండకు వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చామన్నారు.