Volunteers In AP: వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఏపీ మంత్రి కీలక ప్రకటన
Andhra Pradesh Volunteers | ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ తొలగించేది లేదని, వారి భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని మంత్రి
AP minister Dola Bala Veeranjaneya swamy | అమరావతి: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం తీసేస్తోందని, వాలంటీర్ల భవిష్యత్ ప్రశ్నార్థకం అని జరుగుతున్న ప్రచారంపై ఓ మంత్రి స్పందించారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడే ఉందని, వాలంటీర్లు, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేస్తుందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
వాలంటీర్ల భవిష్యత్ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖామంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వాలంటీర్లపై రోజుకో కొత్త విషయం ప్రచారం జరుగుతుండటంతో సోమవారం నాడు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వాలంటీర్లను ఎన్నిటికీ మోసం చేయదని, వారి కోసం మంచి నిర్ణయం తీసుకుంటుదని పేర్కొన్నారు.
వెనకడుగు వేసే ప్రసక్తే లేదు
ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ, కూటమి మేనిఫెస్టోలో పొందుపర్చిన విషయాలపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. వాలంటీర్లు తమ భవిష్యత్ గురించి ఆందోళన చెందవద్దన్నారు. మిమ్మల్ని భయాందోళనలకు గురిచేసే తప్పుడు కథనాలనూ నమ్మవద్దని వాలంటీర్లకు సూచించారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు దుష్ప్రచారం చేస్తే, ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వాలంటీర్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుందని వైసీపీ అని ఆరోపించారు. వాలంటీర్ సేవలను ఏడాది నుంచి రెన్యువల్ చేయకుండా మోసం చేసింది గత ప్రభుత్వమని పేర్కొన్నారు.
‘వైసీపీ నేతలు తమ ప్రయోజనాల కోసం వాలంటీర్లతో బలవంతంగా రాజీనామలు చేయించారు. ఈ విషయాన్ని ఆ వాలంటీర్లు మరిచిపోకూడదు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడం, లేక వారి భవిష్యత్తుకు హామీ ఇచ్చే నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ వైసీపీ నేతలు ఎన్నికల్లో గెలిచేందుకు వారిని రెచ్చగొట్టి రాజీనామాలు చేయించి.. వాలంటీర్ల భవిష్యత్‌ను అయోమయంలోకి నెట్టేశారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. వైసీపీ శ్రేణులు చేసే మోసపూరిత ప్రచారాలను నమ్మవద్దని’ డోలా బాల వీరాంజనేయ స్వామి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వాలంటీర్ల సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు తొలగించడం వాలంటీర్లను తొలగించడమేనని జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఈ విధంగా స్పందించారు.
Also Read: వ్యక్తిగత భద్రతపై ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్, ప్రాణహాని ఉందన్న మాజీ సీఎం