AP Local Body Elections: ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
YSRCP Local Polls Strategy: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు కూటమి పాలనకు రెఫరెండమా? ప్రజాభిప్రాయం, అధికార-ప్రతిపక్షాలు ఇదే విధానానికి అంగీకరిస్తాయా?

AP Politics Ground Reality: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు శరవేగంగా సాగుతుండటంతో, ఈ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వం సాధించిన రెండేళ్ల పాలనకు రెఫరెండం అవుతాయా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. సర్వే ఏజెన్సీలు ఇచ్చే ప్రైవేటు సర్వేలు, ఒపీనియన్ పోల్స్ ఎన్ని వచ్చినా.. గ్రామ , నగర స్థాయిలో ఓటర్లు నేరుగా తమ ఓటు హక్కును వినియోగించుకునే ఈ ఎన్నికలే అసలైన ప్రజాభిప్రాయానికి నిలువెత్తు అద్దమని నమ్మడంలో సందేహం లేదు. అయితే, ఈ ఎన్నికలను బహిరంగంగా రెఫరెండం గా అంగీకరించేందుకు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార పక్షం ముందుకు వస్తుందా లేదా అనేది అసలైన ప్రశ్న.
రిఫరెండమని అంగీకరించని అధికార పార్టీలు
సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలను తమ ప్రభుత్వ పాలనపై రెఫరెండం అని అధికారికంగా ప్రకటించడానికి ఇష్టపడవు. స్థానిక ఎన్నికల్లో కేవలం రాష్ట్రస్థాయి విధానాలు లేదా సంక్షేమ పథకాలే కాకుండా, స్థానిక అభ్యర్థి ఇమేజ్, కుల సమీకరణాలు, వ్యక్తిగత సంబంధాలు, ధనప్రవాహం వంటి అనేక హైపర్-లోకల్ అంశాలు ప్రభావం చూపుతాయి. ప్రభుత్వంపై ఎంత పాజిటివ్ వేవ్ ఉన్నప్పటికీ, స్థానికంగా ఎంపీటీసీ, సర్పంచ్ , కార్పొరేటర్ అభ్యర్థులపై ఉండే అసంతృప్తి వల్ల కూడా కొన్ని స్థానాలు చేజారే ప్రమాదం ఉంటుంది. అందుకే, అధికార కూటమి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసినప్పటికీ, దీనికి రెఫరెండం ముద్ర వేసి అనవసర రాజకీయ ప్రమాదాన్ని కొనితెచ్చుకోదు.
గ్రౌండ్ రియాలిటీని చెప్పే స్థానిక ఎన్నికలు
మరోవైపు, ప్రైవేటు సర్వేల ను పక్కన పెడితే.. స్థానిక పోరులో వచ్చే ఫలితాలే అసలైన గ్రౌండ్ రియాలిటీని సూచిస్తాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సంచలనాత్మక తీర్పు తర్వాత, కూటమి అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీలు, పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలు , అమరావతి అభివృద్ధి వంటి పరిణామాలు ప్రజల్లో ఎంతవరకు సానుకూలతను నింపాయో ఈ ఎన్నికల ద్వారా స్పష్టమవుతుంది. గ్రామీణ ,పట్టణ ఓటర్లు కూటమి పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది బ్యాలెట్ బాక్సుల ద్వారా నిరూపితమవుతుంది.
వైసీపీ రిఫరెండమని చెప్పగలదా?
ఇక ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఈ రెఫరెండం వాదనను ఒక రాజకీయ ఆయుధంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు, హామీల నెరవేర్పులో జరుగుతున్న జాప్యానికి ఈ ఎన్నికలే కొలమానం అని ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చని భావిస్తోంది. అయితే, జగన్ పార్టీ నిజంగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అధికార పార్టీకి కౌంటర్ ఇవ్వాలంటే కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, ప్రతీ స్థానంలోనూ గట్టి పోటీని ఇచ్చి ఓటర్లలో నమ్మకాన్ని పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఇక అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పరంగా చూస్తే, ఈ ఎన్నికలు కేవలం గెలుపోటములకే పరిమితం కాకుండా, మిత్రపక్షాల మధ్య సమన్వయం ఎంతవరకు బలపడిందో తేల్చే వేదికగా మారనున్నాయి. క్షేత్రస్థాయిలో వార్డులు, పంచాయతీల స్థాయిలో టిక్కెట్ల కేటాయింపులో పార్టీల మధ్య ఘర్షణలు రాకుండా చూసుకోవడం కూటమి పెద్దలకు సవాలుగా మారనుంది.
ఒప్పుకోకపోయినా ప్రజాభిప్రాయమే !
కూటమి నేతలు స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిపి భారీ విజయాన్ని సాధిస్తే, అది వైఎస్ఆర్సీపీ నైతిక ధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, కూటమి పాలనకు ప్రజల ఆమోదముద్ర పడినట్లే అవుతుంది. సాంకేతికంగా లేదా అధికారికంగా ఏ పార్టీ కూడా ఈ స్థానిక పోరును పాలనా రెఫరెండం అని ఒప్పుకోకపోయినా, రాజకీయ విశ్లేషకుల దృష్టిలో మరియు ప్రజల ఆలోచనల్లో ఇది కచ్చితంగా కూటమి ప్రభుత్వ పనితీరుకు వేసే గ్రేడింగ్ మార్కులే. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికలకు స్పష్టమైన పొలిటికల్ రోడ్మ్యాప్ను, మూడ్ను నిర్దేశిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















