Swiggy Services: ఏపీలో స్విగ్గీ బాయ్‌కాట్ - హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
Andhra News: ఏపీ హోటల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమకు నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెడుతోందని రాష్ట్రంలో స్విగ్గీని బహిష్కరించాలని నిర్ణయించింది.
AP Hotels Management Boycott Swiggy: ఏపీ హోటళ్ల యాజమాన్యాలు (AP Hotels Association) సంచలన నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రంలో స్విగ్గీని బహిష్కరించాలని నిర్ణయించాయి. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెడుతున్న 'స్విగ్గీ'పై హోటల్, రెస్టారెంట్ల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నెల 14వ తేదీ నుంచి స్విగ్గీకి అమ్మకాలు నిలిపేయాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని హోటల్స్‌లో స్విగ్గీని (Swiggy) బాయ్‌కాట్ చేస్తున్నట్లు ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్‌వీ స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు స్పష్టం చేశారు. 'స్విగ్గీ, జొమాటో వల్ల హోటళ్లు, రెస్టారెంట్లకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఈ రెండు సంస్థల యాజమాన్యాలతో గతంలో చర్చలు జరిపాం. మా అభ్యంతరాలను జొమాటో మాత్రమే అంగీకరించింది. కానీ, స్విగ్గీ కాలయాపన చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో అన్ని హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాం. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల 14వ తేదీ నుంచి స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నాం.' అని తెలిపారు.
అయితే, స్విగ్గీ, జొమాటోకు సహకరించేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్లు చెప్పారు. కానీ, నియమ నిబంధనల్లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. క్రేజీ ప్యాకేజీల పేరుతో తయారైన ఆహారం కంటే తక్కువ ధరకు విక్రయాలతో మేం నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.