AP Home Minister : ఎంపీ ఇచ్చిన ఫిర్యాదుపైనే విచారణ -ఎంపీ మాధన్ వీడియోపై ఏపీ హోంమంత్రి స్పందన !
న్యూడ్ వీడియో వివాదంలో ఏపీ హోంమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. తన వీడియో మార్ఫింగ్ చేశారని ఎంపీ ఇచ్చిన ఫిర్యాదుపైనే విచారణ జరుపుతున్నామని తెలిపారు.
AP Home Minister : వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మాధన్ న్యూడ్ వీడియో వివాదంలో ఆయన ఇచ్చిన ఫిర్యాదుపైనే విచారణ చేస్తున్నామని ఏపీ హోంమంత్రి వనిత ప్రకటించారు. ఆ వీడియో వ్యవహారంలో బాధిత మహిళల ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అయినా సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా, ఎంపీ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని మీడియాకుచెప్పారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో.. తప్పు చేసినట్టు నిరూపణ అయితే కచ్చితంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియో అసలో, కాదో.. అన్నదాని పై ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని, ఆ నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. తప్పు ఎవరు చేసినా, తన, మన అన్న తారతమ్యం లేకుండా, తప్పును తప్పుగానే చూస్తామని చెప్పారు.
ఏదో జరిగిపోయినట్లు టీడీపీ నేతల హడావుడి
ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు చేస్తున్న తెలుగుదేశం పార్టీపై హోంమంత్రి విరుచుకుపడ్డారు. మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ శాడిస్టు సైకాలజీని ప్రదర్శిస్తోందని రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి తానేటి వనిత మండిపడ్డారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని, మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయంటూ.. టీడీపీ మహిళా నేతలు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు. మా ప్రభుత్వం ఎంపీని కాపాడుతున్నట్టు, బాధిత మహిళకు అన్యాయం చేస్తున్నట్లుగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
టీడీపీ నేతల తీరు మహిళలు సిగ్గుపడేలా ఉంది !
ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద నోరు పారేసుకుంటున్న మహిళలు వాడుతున్న భాష, వారి బాడీ లాంగ్వేజ్... రాష్ట్రంలోని మహిళలంతా సిగ్గుపడే విధంగా ఉందన్నారు. వీడియోపై సంబంధిత ఎంపీనే కంప్లైంట్ చేశారు. అది మార్ఫింగ్ వీడియో అని, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. అతను తప్పు చేశాడు అని నిర్థారణ అయితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయన్నారు. మహిళలకు న్యాయం చేయటానికి, మహిళల గౌరవం కాపాడటానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ముందు ఉంటారు. అందులో ఎవరూ సందేహపడాల్సిన పనిలేదు.
టీడీపీ హయాంలో జరిగిన వాటికేం చెబుతారు
తెలుగుదేశం పార్టీ హయాంలో ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఒక మహిళా ఎమ్మార్వోను చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టుకుని ఈడ్చి కొడితే ఎందుకు న్యాయం చేయలేదని వని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు.. ఒక ముస్లిం మహిళా ప్రజా ప్రతినిధిని నోటికొచ్చినట్లు మాట్లాడితే, మీడియా ముందుకు వచ్చి ఏడిస్తే.. ఆరోజున చంద్రబాబు ఏమి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. విజయవాడ నగరంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో.. మహిళలకు అప్పులిచ్చి, తీర్చలేని మహిళల్ని లైంగికంగా వేధింపులకు గురి, వీడియోలు తీస్తే.. అప్పడు ఆరోపణలు వచ్చిన బుద్దా వెంకన్న తదితరులపై మీరు ఏమి చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. మహిళకు ఈ ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుందనేది గత మూడేళ్ళుగా జగన్ గారి పరిపాలనను చూస్తే అర్థమవుతుందన్నారు.