Rains Update: ఏపీలో ఆ జిల్లాల్లో ఆకస్మిక వరదలు, నేడు స్కూళ్లకు సెలవులు - తెలంగాణలో మోస్తరు వర్షాలు
AP Rains News | బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్రరూపం దాల్చి గురువారం నాడు తీరం దాటనుంది. దాని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
నైరుతి బంగాళాఖాతములో ఏర్పడిన వాయుగుండము పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. అక్టోబర్ 17 ఉదయం ఉత్తర తమిళనాడు - దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీరాల మధ్య ఉన్న పుదుచ్చేరి- నెల్లూరు మధ్య చెన్నైకి దగ్గరగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఏపీలో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలకు ఛాన్స్
కొన్ని రోజుల కిందట తెలంగాణలో ఖమ్మంలో, ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో తీవ్ర నష్టం వాటిల్లింది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటనుండటంతో గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ కేంద్రం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో కొన్ని జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ కేంద్రం రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు.
Special Bulletin regarding Depression over southwest and adjoining westcentral Bay of Bengal pic.twitter.com/0x0mTYwBl1
— MC Amaravati (@AmaravatiMc) October 16, 2024
ఏపీలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గురువారం నాడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం తలెత్తనుంది. వాగుల, వంకలు పొంగి పొర్లడంతో రోడ్డు మార్గం దెబ్బతిని రవాణా సౌకర్యాలకు అంతరాయం కలగనుంది. భారీగా పంటలు, ఆస్తి నష్టం సంభవిస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కానున్నాయని, అధికారులు వీరితో పాటు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు.
పరీక్షలు వాయిదా, పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
ఉత్తరాంధ్రలో తేలికపాటి జల్లుల నంచి మోస్తరు వర్షాలు పడతాయి. వర్షాల కారణంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గురువారం నుంచి జరగాల్సిన పరీక్షల్ని వాయిదా వేశారు. తుపాను కారణంగా దూర విద్యా కేంద్రం పరీక్షలు వాయిదా పడ్డాయి. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, శ్రీసత్యసాయి, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో నేడు (గురువారం) అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఆకస్మిక వరదలకు అవకాశం ఉందని హెచ్చరికలతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
తెలంగాణలో 2 రోజులపాటు మోస్తరు వర్షాలు
తెలంగాణలో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసి అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో కొన్ని జిల్లాల్లో గాలులు వీచనున్నాయి. నేడు ఉదయం నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో వార్నింగ్ జారీ అయింది.
7-day forecast(NIGHT) of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :16-10-2024@CEO_Telangana @TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @CommissionrGHMC @TelanganaCMO @GHMCOnline @HYDTP @IasTelangana @tg_weather pic.twitter.com/DgTOmve43j
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) October 16, 2024
గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం నాడు సైతం కొమరం భీం ఆసిఫాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలలో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.