AP News: ఆర్కే రోజా, ధర్మానకు బిగుస్తున్న ఉచ్చు! విచారణకు ప్రభుత్వం ఉత్తర్వులు
Telugu News: మాజీ సీఎం జగన్ హాయాంలో అమలు చేసిన ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో నిధులు దుర్వినియోగం కావడమే కాక, పక్కదారి పట్టినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణకు ఆదేశించారు.
AP Latest News: మాజీ మంత్రులు ఆర్కే రోజా, ధర్మాన క్రిష్ణదాస్‌కు త్వరలో చిక్కులు ఎదురుకానున్నట్లుగా తెలుస్తోంది. వీరిపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ మోహన్ రెడ్డి హాయాంలో అప్పటి ప్రభుత్వం అమలు చేసిన ఆడుదాం ఆంధ్ర అనే క్రీడా కార్యక్రమంలో నిధులు దుర్వినియోగం కావడమే కాక, పక్కదారి పట్టినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి రూ.కోట్లు నష్టం వాటిల్లేలా వారు వ్యవహరించారని మాజీ మంత్రులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఏపీ ఆత్యా - పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్ సీఐడీ డీఐజీకి ఈ ఫిర్యాదు చేశారు. ఆడుదాం ఆంధ్రా, సీఎం కప్ కార్యక్రమాల పేరుతో క్రీడలశాఖ మంత్రిగా పని చేసిన ఆర్కే రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదులో ఆరోపించారు. సీఐడీ విచారణ కోరుతూ సీఐడీ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ఆడుదాం ఆంధ్రా అనేది క్రీడలను ప్రోత్సహించడానికి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక క్రీడా కార్యక్రమం. ఇది 2023 డిసెంబరు 15 నుంచి 2024 ఫిబ్రవరి 3 వరకు నిర్వహించారు. క్రికెట్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో బ్యాడ్మింటన్ డబుల్స్‌తో పాటు ఇతర ఆటలు, యోగా, టెన్నికాయిట్ 3 కిలో మీటర్ల మారథాన్ ఆడుదాం ఆంధ్రలో భాగంగా నిర్వహించారు. గ్రామం లేదా వార్డు సచివాలయం, మండల, నియోజకవర్గం, జిల్లా రాష్ట్ర స్థాయిలలో ఈ పోటీలను నిర్వహించారు. అయితే, ఈ ఆటలకు సంబంధించిన వస్తువులను కూడా క్రీడాకారులకు ప్రభుత్వమే సరఫరా చేసింది. ఈ కిట్లలోనే లొసుగులు చోటు చేసుకున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన జట్లకు రూ.35 వేలు బహుమానం ఇచ్చారు. రెండో, మూడో స్థానంలో నిలిచిన జట్లకు రూ.15 వేలు, రూ.5 వేలు నగదు బహుమతి ఇచ్చారు. జిల్లా స్థాయిలో, మొదటి మూడు జట్లు వరుసగా రూ.60 వేలు, రూ.30 వేలు, రూ.10 వేలు ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో అయితే, రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల నగదు బహుమతి అందించారు.