Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Tirumala News: తిరుమలలో లడ్డూ వివాదం కొనసాగుతోన్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
SIT On Tirumala Laddu Issue: తిరుమలలో లడ్డూ వివాదంపై (Tirumala Laddu Row) కొనసాగుతోన్న క్రమంలో ఏపీ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వ్యవహరించనున్నారు. అలాగే, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు దర్యాప్తు బృందంలో ఉండనున్నారు. కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న వ్యవహారం గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై రాజకీయంగానూ పెద్ద దుమారమే రేగింది.
ఇదీ జరిగింది
తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) వ్యాఖ్యానించగా.. ఇందుకు సంబంధించిన ఆధారాలను టీడీపీ నేతలు బయటపెట్టారు. ఈ క్రమంలో గత వైసీపీ హయాంలో ఆలయంలో అపచారం జరిగిందని పెద్ద దుమారమే రేగింది. దీనిపై టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మరోవైపు, భక్తులు సైతం ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీటీడీ సోమవారం పవిత్ర హోమాన్ని నిర్వహించింది. లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు ఉదయం శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది. రుత్వికులు వాస్తు శుద్ధి, కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారు.
ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం, నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలు, అపోహలు పక్కన పెట్టవచ్చని ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు వెల్లడించారు. యాగశాలలో సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, కుంభప్రతిష్ట, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇకపై లడ్డూ ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని, భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చని స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం ప్రాయశ్చిత్త దీక్ష
మరోవైపు, ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యామ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో పవన్ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఆలయం వద్ద మెట్లను శుభ్రం చేసి అనంతరం మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ కార్యక్రమం జరిగింది. ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు పవన్ అక్టోబర్ 1న తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు నడుచుకుంటూ వెళ్తారు. 2వ తేదీన శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దీక్ష విరమిస్తారు.
ఆ ప్రచారంపై టీటీడీ క్లారిటీ
అటు, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదని తెలిపింది. 'లడ్డూ పోటులో శ్రీవైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తి శ్రద్ధలు, నియమ నిష్టలతో ప్రతిరోజూ లక్షలాది లడ్డూలను తయారు చేస్తారు. సీసీ టీవీల పర్యవేక్షణలో ఈ లడ్డూ తయారీ ఉంటుంది. ఇంతటి పకడ్బందీగా లడ్డూలు తయారు చేసే వ్యవస్థలో పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయం. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి.' అని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది.