Sajjala Forest Lands: సజ్జలకు బిగ్ షాక్ - ఉన్న 55 ఎకరాల స్వాధీనం - అటవీ భూమేనని నిర్దారించిన కలెక్టర్
Kadapa: సజ్జల కుటుంబం అధీనంలో ఉన్న 55 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అటవీ భూముల్ని కబ్జా చేసినట్లుగా అధికారులు గుర్తించారు.

Sajjala Lands: కడప జిల్లా చింతకొమ్ము దిన్నె మండలంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం చేతుల్లో ఉన్న 55 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా సీకే దిన్నె మండలంలో సజ్జల కుటుంబానికి కొంత భూమి ఉంది. తమ భూమి పక్కనే ఉన్న అటవీ భూమిని వారు ఆక్రమించుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. సజ్జల కుటుంబం చేసిన అడవి కబ్జాపై ఆరోపణలు రావడంతో అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ విచారణ చేయించారు. విచారణలో అసలు సజ్జల కుటుంబానికి అక్కడ అంత భూమి లేదని తేలింది. అటవీ భూమిని ఆక్రమించుకున్నట్లుగా సర్వేలో తేలింది. పూర్తి స్థాయిలో సర్వే చేసిన కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. యాభై ఐదు ఎకరాల అటవీ భూమి ఉందని తేలడంతో వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. గురువారం భూములను అధికారికంగా స్వాధీనం చేసుకుని బోర్డులు పాతనున్నారు.
సజ్జల కుటుంబం మొత్తం 63.72 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్లు కమిటీ నిర్ధారించింది. ఇందులో 52.40 ఎకరాలు స్పష్టంగా అటవీ శాఖ భూములుగా అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ భూములు కడప జిల్లాలోని చింతకొమ్మదిన్నె (CK దిన్నె) మండలంలో, సర్వే నంబర్ 1629లో భాగంగా ఉన్నాయి, ఇందులో 11,000 ఎకరాల అటవీ భూమి ఉంది. ఈ ఆక్రమణలో 8.05 ఎకరాలు పాయవంక రిజర్వాయర్ కోసం ప్రభుత్వం సేకరించిన భూమి, మరికొంత భాగం అసైన్డ్ ల్యాండ్‌గా ఉంది. సజ్జల కుటుంబం 146 ఎకరాల పట్టా భూమిని CK దిన్నె మండలంలో నమోదు చేసుకుంది. సజ్జల రామకృష్ణారెడ్డి మేనల్లుడు సజ్జల సందీప్ రెడ్డి పేరిట 71.49 ఎకరాలు. జనార్దన్ రెడ్డి పేరిట 18.85 ఎకరాలు. ఇతర కుటుంబ సభ్యుల పేరిట మిగిలిన భాగం ఉంది.
ఈ భూమిలో గెస్ట్ హౌస్, నాలుగు గదులు, ఫెన్సింగ్, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ, మామిడి తోటలు, పండ్ల తోటలు, హార్వెస్టింగ్ రూమ్‌ను నిర్మించారు. వీటికి అనుమతులు లేవు. వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వ హయాంలో, సజ్జల రామకృష్ణారెడ్డి కడప మాజీ డిఎఫ్‌ఓపై ఒత్తిడి చేసి ఈ ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. 2014లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నోటీసులు జారీ చేశారు కానీ.. అవి ఏళ్లుగా తమ అధీనంలోనే ఉన్నాయని సజ్జల కుటుంబం చెబుతోంది.
అయితే సజ్జల రామకృష్ణారెడ్డి కడప సమీపంలోని మామిడి తోటల్లో తనకు ఒక్క సెంటు భూమి కూడా లేదని, 1995లో సోదరులతో కలిసి కొనుగోలు చేసిన భూమిని 10 ఏళ్ల తర్వాత వారికే వదిలేశానని ప్రకటించారు. ఆ తర్వాత ఆ భూములతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కడప జిల్లాలోని సజ్జల ఎస్టేట్‌గా ఆ ప్రాంతాన్ని పిలుస్తారు.





















