AP Election News: కౌంటింగ్ వేళ రాజకీయ పార్టీలకు ఈసీ గుడ్ న్యూస్, లోనికి వారికి ఛాన్స్
Telugu News: ఏపీలో ఎన్నికల లెక్కింపు జరుగుతున్న సమయంలో మరో ఏజెంట్‌కు నియమించుకోవడం కోసం రాజకీయ పార్టీలకు ఈసీ అనుమతి ఇచ్చింది.
Election Counting in AP: ఏపీలో ఓట్ల లెక్కింపు జరిగే వేళ ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు ఓ వెసులుబాటు కల్పించింది. జూన్ 4 మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్ సభ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలో ఈసీ రాజకీయ పార్టీలకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ కేంద్రంలో మరో ఏజెంట్‌కు నియమించుకోవడం కోసం రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ దగ్గర మరో ఏజెంట్‌ను పార్టీలు నియమించుకోవచ్చని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం వెల్లడించింది.
అభ్యర్థి లేని సమయంలో మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించుకునేలా రాజకీయ పార్టీల ఏజెంట్‌లకు అవకాశం కల్పించినట్లుగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మరోవైపు, కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘట నలకు తావులేకుండా ముడంచెల భద్రతను ఎన్నికల సంఘం కేంద్ర భద్రతా సంస్థల సాయంతో ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఐడీ కార్డులు, ప్రత్యేక పాసులు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించేలా కఠినంగా వ్యవహరించనున్నారు. ఈ విషయంలో ఎవరు ఆలసత్వంగా వ్యవహరించినా వారిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కలెక్టర్, ఎస్పీలు హెచ్చరికలు జారీ చేశారు.
ఏజెంట్ ఎవరంటే..
ఓట్ల లెక్కింపు సమయంలో రాజకీయ పార్టీలు పంపిన ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తారు. కౌంటింగ్ కేంద్రాల్లో వీరు అన్ని విషయాలను క్షుణ్నంగా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎన్డీయే కూటమి, అధికార వైసీపీ అభ్యర్థులు తమకు, తమ పార్టీకి విధేయులుగా ఉన్న వారిని ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించుకున్నారు. వీరు కౌంటింగ్ కేంద్రాల్లో ఉండి అప్రమత్తంగా వ్యవహరిస్తుండాలి.
ఈ క్రమంలో ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు వారి ఏజెంట్లకు గత 3 రోజుల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆదివారం కూడా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీల అభ్యర్థులు ఏజెంట్లకు శిక్షణనిచ్చే పనిలోనే ఉన్నారు. ఎక్కడా ఏమరుపాటుకు తావులేకుండా... చర్చలకు తావివ్వకుండా జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను ఆయా పార్టీల అభ్యర్థులు వారి వారి ఏజెంట్లకు వివరించడం గమనార్హం.