కోడి పందేలు, క్యాసినోపై అర్ధరాత్రి డీజీపీకి ఫోన్, రంగంలోకి దిగిన ఎస్పీ - అక్కడికి వెళ్లి చూస్తే షాక్ !
కోడి పందేల శిబిరాలను ఈ ఏడాది సైతం పాలిటిక్స్ శాసించాయా. స్థానిక పోలీసులను పొలిటికల్ లీడర్లు తమ గుప్పిట్లో పెట్టుకోవటంతో ఈ సారి సైతం కోడి పందాలు యధావిధిగా నిర్వహించినట్లు తెలుస్తోంది.
కోడి పందేల శిబిరాలను ఈ ఏడాది సైతం పాలిటిక్స్ శాసించాయా. పోలీసులు చేసిన ప్రయత్నాలు కొన్నిచోట్ల ప్రభావం చూపించలేకపోయాయి. స్థానిక పోలీసులను పొలిటికల్ లీడర్లు తమ గుప్పిట్లో పెట్టుకోవటంతో ఈ సారి సైతం కోడి పందాలు యధావిధిగా నిర్వహించినట్లు తెలుస్తోంది.
కోడి పందేలపై నేరుగా డీజీపీకే ఫిర్యాదు...
బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలలో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఓ అజ్ఞాత వ్యక్తి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన అంశం పోలీస్ శాఖలో కలకలం రేపింది. ఈ ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ జాషువా అర్ధరాత్రి ఆ శిబిరంపై తమ సిబ్బందితో కలసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులపాటు పోలీసుల మౌఖిక అనుమతులతో నిర్వహించనున్న కోడి పందాలు, పేకాట, నెంబర్ లాటకు ఎదురు లేకుండాపోయింది. అయితే పోలీసులు వచ్చి హడావిడి చేసిన సమయంలో మాత్రం నిర్వాహకులు కొంచెం సేపు పందాలు ఆపేశారు.
డీజీపీకి ఫిర్యాదు చేసిన వ్యక్తి అంపాపురంలో క్యాసినో ఏర్పాటు చేసినట్లు, చీర్ గాల్స్ తో పందెం రాయుళ్లకు సకల సౌకర్యాలు చేస్తున్నట్లు వీడియోతో సహా ఆధారాలు పంపినట్లు తెలుస్తుంది. డీజేపీ ఆదేశాల మేరకే జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. శిబిరంలో పూర్తిగా తనిఖీలు చేశామని అమ్మాయిలను తీసుకువచ్చారనే ఆరోపణలు అవాస్తమని ఎస్పీ జాషువా అన్నారు. శిబిరాల వద్ద సమయం దాటినా జనం ఉండటం, కొంతమంది భోజనాలు చేసున్నారని ఏటువంటి పరిస్థితిలో ఈ సమయం వరకు ఉండటానికి వీలు లేదని, అ దిశగా చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతోపాటు సంఘటనఫై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.
ఆకస్మిక తనిఖీకి ముందు హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అల్లు నవీన్ నరసింహమూర్తితో ఎస్పీ కొద్దిసేపు చర్చలు జరిపారు. జిల్లా ఎస్పీ అంపాపురం కోడిపందేల స్థావరాన్ని ఆకస్మిక తనిఖీ చేస్తారని సమాచారాన్ని ఆ శాఖలోని సిబ్బంది ముందస్తుగా నిర్వాహకులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. పోలీసుల ముందస్తు సమాచారంతో ఎస్పీ ఆకస్మిక తనిఖీకి వచ్చే సమయానికి గంట ముందు నిర్వాహకులు యుద్ధ ప్రాతిపదికన లైట్లు ఆర్పివేసి నిర్వహిస్తున్న శిబిరాలన్నీ అప్పటికప్పుడు నిలిపివేసి వెళ్లిపోయారు.
కొడాలి నాని విత్ వివి వినాయక్...
సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ సినీ దర్శకులు వివి వినాయక్ అన్నారు. తాను దర్శకత్వం వహించిన హిందీ చిత్రం మార్చిలో లో విడుదల కానుందని తెలిపారు. కొడాలి నాని వల్లనే తాను ఈ స్థితిలో ఉన్నానని, ఆయనతో కలిసి సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. గుడివాడలో నిర్వహించిన జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు ప్రదర్శనలకు ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక్‌కు మాజీ మంత్రి కొడాలి నాని ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. సంతోషకరమైన వాతావరణంలో ప్రజలు పండుగను జరుపుకుంటున్నారని, చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతీ సంక్రాంతి అందరూ ఇలానే జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గుడివాడలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండ లాగుడు ప్రదర్శనలను తొలిసారి వీక్షించానని, ప్రదర్శనలు చాలా బాగున్నాయన్నారు. ఈ ఏడాది మార్చిలో తాను డైరెక్ట్ చేసిన, హిందీ సినిమా విడుదలవుతుందని, హిందీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా చేస్తానని ఆయన చెప్పారు. కొడాలి నాని వల్లే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని, నాని తనకెంతో ఇష్టమైన వ్యక్తి ఎప్పుడంటే అప్పుడు సినిమా చేసేందుకు నేను సిద్ధమని వినాయక్ ప్రకటించారు.