Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Andhra News: సీఎం కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ అయ్యారు. కాగా, ఇటీవల తానే హోంమంత్రినైతే అంటూ పవన్ చేసిన వ్యాఖ్యల క్రమంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Pawan Kalyan And Home Minister Anitha Meeting: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), హోంమంత్రి అనిత (Home Minister Anitha) సీఎం కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలపై ఇరువురూ చర్చించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటోన్న చర్యల గురించి పవన్‌కు అనిత వివరించారు. తన కూతురు కన్నీళ్లు చూసే తాను ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశానని పవన్ తెలిపారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని.. ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించినట్లు అనిత చెప్పారు. తాను కూడా ఫేక్ పోస్ట్ బాధితురాలినేనని అన్నారు. అలాగే, జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం శ్రమించే ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఇరువురు నేతలు చర్చించుకున్నారు.
*రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ గారితో మార్యదపూర్వకంగా సమావేశమవడం జరిగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు , హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న… pic.twitter.com/MLGmWGvevr
— Anitha Vangalapudi (@Anitha_TDP) November 7, 2024
కాగా, ఇటీవల పిఠాపురం సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని వ్యాఖ్యానించారు. అత్యాచార నిందితుల్ని పోలీసులు వేగంగా అరెస్టు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'మమ్మల్ని విమర్శించే నాయకులందరికీ ఈ రోజు చెబుతున్నా. ఇలాగే ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉండండి. హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకోండి. ఈ మాత్రం ధైర్యం లేనప్పుడు పోలీసులు ఉండడం ఎందుకు.?. నేను అడగలేక కాదు.. హోంశాఖ తీసుకోలేక కాదు. నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. గత ప్రభుత్వంలో పోలీసులు, అధికారులు నియంత్రణ లేకుండా వ్యవహరించారు. క్రిమినల్స్‌కు కులం, మతం ఉండబోవు. అత్యాచార నిందితుల్ని అరెస్టు చేయడానికి కులం ఎందుకు అడ్డం వస్తోంది. ఈ విషయం పోలీస్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పాలి. పోలీసులు అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు.' అని పేర్కొన్నారు.
హోంమంత్రి స్పందన
ఈ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఓ జాతీయ మీడియాతో స్పందించారు. పవన్ అన్న దాంట్లో తప్పేం లేదని అన్నారు. 'రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు, నేను, పోలీసులు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. వాటిలో పవన్ కల్యాణ్ కూడా భాగమే. ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టే మాట్లాడారు. పవన్ మాట్లాడిన దానికి కారణాలు వెతకాల్సిన అవసరం లేదు. ఆయన ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో నాకు తెలుసు. పిఠాపురం సభలో ఆయన మాట్లాడిన దానిలో ఎలాంటి రాజకీయం లేదని నాకు తెలుసు.' అని అనిత వివరించారు.
అటు, బుధవారం కేబినెట్ భేటీ అనంతరం పవన్ ఈ అంశాలపై సీఎం చంద్రబాబుతో చర్చించారు. సర్కారును కించపరిచే పోస్టులపై ఉదాసీనత తగదని ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అసభ్యకరమైన, అవాస్తవ పోస్టులపై ఫిర్యాదులు వస్తున్నా.. కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నట్లు సమాచారం. దీనిపై స్పందించిన సీఎం.. గత ప్రభుత్వం నుంచే పోలీసులు ఇలా తయారయ్యారని.. నెల రోజుల్లో వ్యవస్థను గాడిన పెడదామని అన్నారు.
Also Read: Pawan Kalyan: సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు