AP Covid Booster Dose : ఏపీలో 3.44 కోట్ల మందికి ఉచిత బూస్టర్ డోస్, 45 రోజుల్లోనే అందించాలని టార్గెట్- మంత్రి విడదల రజిని
AP Covid Booster Dose : ఏపీలో ఉచితంగా కోవిడ్ బూస్టర్ డోసుల పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభించామని మంత్రి విడదల రజిని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీలు, సచివాలయాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
AP Covid Booster Dose : ఏపీలో 3.44 కోట్ల మందికి బూస్టర్ డోసు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, బూస్టర్ డోసు అందరికీ అందేలా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్‌లో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ రాష్ట్రంలో శుక్రవారం నుంచి 18 నుంచి 60 సంవత్సరాల లోపు వారందరికీ బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ ప్రారంభమైందని తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా శుక్రవారం నుంచి 75 రోజులపాటు దేశంలోని పౌరులందరికీ ఉచితంగా టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. రాష్ట్రంలో బూస్టర్ డోసు కేవలం 45 రోజుల్లో అందజేస్తామని చెప్పారు. బూస్టర్ డోసులు వచ్చినవి వచ్చినట్లు వినియోగించుకునేలా యంత్రాంగం ఉందని తెలిపారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, వాలంటీర్లు ఈ సిబ్బంది మొత్తం బూస్టర్ డోసు పంపిణీ కార్యక్రమంలో పాలుపంచుకుంటారని చెప్పారు.
అన్ని పీహెచ్సీలు, సచివాలయాల్లో బూస్టర్ డోసు
రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీలు, సచివాలయాల్లో శుక్రవారం నుంచి బూస్టర్ డోసు పంపిణీ ప్రారంభమైందని మంత్రి విడదల రజిని తెలిపారు. అక్కడే రిజిస్ట్రేషన్లు చేసి బూస్టర్ డోసు వేస్తున్నట్లు చెప్పారు. అన్ని రైల్వే స్టేషన్లు, కాలేజీలు, పాఠశాలలు, బస్ స్టేషన్లు, ఆయా కంపెనీలు, పారిశ్రామికవాడలు, ఇతర అన్ని పనిప్రాంతాల్లో బూస్టర్ డోసును అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. కోవిడ్ టీకాలు రెండు డోసులూ రాష్ట్రంలో 3.95 కోట్ల మందికి పంపిణీ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకోగా.. అంతకు మించి 4.35 కోట్ల మందికి కోవిడ్ టీకాలు రెండు డోసులు పంపిణీ చేశామని వివరించారు. 60 ఏళ్లు పై బడిన వారిలో ఇప్పటివరకు రాష్ట్రంలోని 36 లక్షల మందికి రెండో డోసుల కోవిడ్ టీకాలతోపాటు బూస్టర్ డోసు కూడా ఇచ్చామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 15 లక్షల బూస్టర్ డోసులు ఉన్నాయని, ఆయా జిల్లాలకు వాటిని సరఫరా చేశామని తెలిపారు.
3.5 కోట్ల మందికి బూస్టర్ డోసులు
రాష్ట్రంలో రోజుకు 15 లక్షల మందికి టీకాలు అందించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఈ లెక్కన 30 రోజుల్లో ప్రజలందరికీ బూస్టర్ టీకాలు అందించగల యంత్రాగం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బూస్టర్ డోసులు వెంటనే వచ్చేలా చర్యలు తీసుకుని కనీసం 45 రోజుల్లో పంపిణీ ప్రక్రియను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ప్రాథమికంగా 3.5 కోట్ల బూస్టర్ డోసులు కావాలని కేంద్ర ప్రభుత్వానికి ఇండెంట్ పంపామన్నారు. అందరికీ ఉచితంగా బూస్టర్ డోసు అందిస్తామన్నారు. రెండు డోసులు కలిపి రాష్ట్రంలో 8.54 కోట్ల కోవిడ్ టీకాలు పంపిణీ చేశామని, ఇందులో కేవలం 7.66 లక్షల మంది మాత్రమే ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా టీకా పొందారని, మిగిలిన అందరికీ ఉచితంగానే టీకాలు వేశామని తెలిపారు.