Cm Jagan Review: అప్పుడు పట్టించుకోలేదు అందుకే ఇప్పుడీ పరిస్థితి... రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై నిర్లక్ష్యం చేసిందని సీఎం జగన్ అన్నారు. అప్పట్లో రోడ్ల మెయింటైనెన్స్ ను గాలికొదిలేశారన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలన్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల మరమ్మత్తులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అందువల్ల ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందని సీఎం జగన్ అన్నారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటికి మరమ్మతులు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, మంచినీటి సరఫరా, ఉపాధి హామీ పథకం, వైఎస్ఆర్ జలకళ, గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలపై సీఎం జగన్ చర్చించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లీనిక్‌లు, డిజిటల్ లైబ్రరీల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీల్లో సురక్షిత మంచినీరు, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
ప్రణాళిక ప్రకారం రోడ్ల నిర్మాణం, మరమ్మతులు
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సీఎం జగన్ సమీక్షించారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల ప్రస్తుత పరిస్థితి వచ్చిందన్నారు. గత రెండేళ్లుగా విస్తారంగా వర్షాలు కురవడంతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయన్నారు. క్రమం తప్పకుండా చేయాల్సిన నిర్వహణను వదిలేయడంతో రోడ్లను నిర్మించి, మరమ్మతు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. భవిష్యత్తులో రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, నిర్మాణంపై అత్యుత్తమ కార్యాచరణ చేపట్టాలని సీఎం జగన్ అన్నారు. ఏ దశలో కూడా నిర్లక్ష్యం లేకుండా మెయింటైనెన్స్ పనులు చేపట్టాలన్నారు. దీనికోసం నిధుల కొరత లేకుండా ఒక ప్రణాళికను ఆలోచించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
ఉపాధి పనుల్లో వాటిని ప్రాధాన్యత
ప్రాధాన్యతా క్రమంలో ఉపాధిహామీ పనులు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీల పూర్తికి ఉపాధి పనుల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అమూల్ పాలసేకరణ చేస్తున్న జిల్లాలను, ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని బీఎంసీయూలను పూర్తిచేయాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి వస్తున్న నిధులను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేయాలని సీఎం సూచించారు.
గ్రామాల్లో చెత్త సేకరణపై
జగనన్న స్వచ్ఛ సంకల్పం, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణపై సీఎం జగన్ సమీక్షించారు. నవంబర్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి చెత్తసేకరణ 22 శాతం ఉంటే ఇప్పుడు 61.5 శాతానికి పెరిగిందన్నారు. అక్టోబరు కల్లా పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. గ్రామాల్లో పరిశుభ్రత మెరుగుపరచాలని సీఎం అధికారులను ఆదేశించారు. మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్వహణపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక రిగ్గు ద్వారా రైతులకు బోర్లు వేయించాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనివల్ల బోర్లు వేసే పని క్రమంగా ముందుకు సాగుతుందన్నారు. బోరు వేసిన వెంటనే మోటారు బిగించాలన్నారు.
Also Read: ఏపీలో ఆ ఉద్యోగులు మాత్రం ఫుల్ ఖుషీ ! స్వీట్స్ పంచేసుకునే ఆర్డినెన్స్ వచ్చేసింది మరి ..