CM Chandrababu: ఏపీలో రహదారులకు మోక్షం - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Andhrapradesh News: ఏపీలో రహదారులకు త్వరలోనే మోక్షం కలగనుంది. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, పరిస్థితిపై అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు.. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
AP CM Chandrababu Review On Roads: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, పరిస్థితిపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆరా తీశారు. రహదారులు, భవనాల శాఖపై అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని.. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. అప్పటి తీరుతో ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పారు. రాష్ట్రంలో రహదారులపై గుంతలు పూడ్చేందుకు రూ.300 కోట్లు అవసరమని అధికారులు తెలిపారు. అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో రోడ్లకు మోక్షం కలగనుంది.
'పరిస్థితి మారాలి'
గత ప్రభుత్వ హయాంలో రోడ్ల స్థితిగతులను కనీసం పట్టించుకోలేదని.. వాహనదారులు, ప్రజలు ఐదేళ్లు నరకం చూశారని.. అనేక ప్రమాదాలకు గురయ్యారని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ పరిస్థితి మారేలా పనులు మొదలు కావాలని అధికారులకు సూచించారు. దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలన్నారు. రాష్ట్రంలో 4,151 కి.మీల మేర రోడ్లపై గుంతల సమస్య ఉందని.. వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2,936 కి.మీ మేర ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,087 కి.మీల పరిధిలో వెంటనే పనులు చేపట్టాలని సీఎం ఆర్అండ్‌బీ అధికారులకు నిర్దేశించారు.
తీర ప్రాంతంలో కోత నివారణపై దృష్టి
మరోవైపు, ఏపీ తీర ప్రాంతంలో సముద్ర కోత నివారణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దృష్టి సారించారు. ఈ మేరకు తీర ప్రాంత నిర్వహణపై ఎన్‌సీసీఆర్ (NCCR - నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్) రూపొందించిన ప్రణాళికను శుక్రవారం ఆయన విడుదల చేశారు. అలల ఉద్ధృతికి భూమి కోతను నివారించేలా NCCR, ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ జోన్ అథారిటీ మధ్య ఒప్పందం కుదిరింది. 'తీర ప్రాంతాల్లో సముద్ర కోత ప్రమాదాన్ని నివారించేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ఇటీవల ఉప్పాడ తీరంలో కోతపై సమీక్షించి నిపుణులతో చర్చించాం. రాష్ట్రవ్యాప్తంగా తీరం వెంట కోత సమస్య ఎక్కడెక్కడ ఉంది.?. వాటి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధ్యయనం చేయాల్సి ఉంది. దీనికి అనుగుణంగా అధికారులకు ఆదేశాలిచ్చాం. రాష్ట్రంలో కొత్త ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్ల కోసం అనువైన ప్రదేశాలు ఎంచుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం.' అని పవన్ వివరించారు.
Also Read: Free Bus Service: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ - ఉచిత బస్సు ప్రయాణం అమలు ఆ రోజు నుంచే!