andhra Caste Census Postpone : ఏపీలో కులగణన మళ్లీ వాయిదా - భారీ వర్షాలే కారణం !
Caste census postponed again : ఏపీలో కులగణన మళ్లీ వాయిదా పడింది. భారీ వర్షాల వల్ల వాయిదా వేస్తున్నామని ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు.
andhra Caste Census : ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కుల గణన ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నందున వాయిదా వేస్తున్నట్లుగా మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. ఎప్పటి నుండి నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామన్నారు. నిజానికి గత నెల 27వ తేదీ నుండి కుల గణన ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించింది. ఇందు కోసం సన్నాహాక శిబిరాలను కూడా పూర్తి చేశారు. పూర్తి స్థాయి కులగణనకు ఏర్పాట్లు చేశారు. 27 నుంచి వారం రోజుల్లో కులగణన చేయాలనుకున్నారు. కానీ వాలంటీర్లు.. సచివాలయ సిబ్బంది.. వై ఏపీ నీడ్స్ జగన్ వంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున డిసెంబర్ 10వ తేదీ నుండి చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పుడు వర్షాల కారణంగా మరోసారి వాయిదా వేశారు.
ప్రభుత్వ కార్యక్రమాలకు తోడు వర్షాలు
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో పాటుగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీటికి సన్నాహాలు చేస్తున్న సమయంలోనే పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. మచౌంగ్ తుపాను కోస్తా తీర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. కులగణన కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నిర్ణయాల్లో సవరణ చేసింది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద వేర్వేరు చోట్ల మూడు గ్రామ సచివాలయాలు, రెండు వార్డు సచివాలయాల పరిధిలో సర్వే నిర్వహించారు.
కులగణనకు ప్రత్యేక యాప్ రెడీ చేసిన ప్రభుత్వం
కులగణన వాలంటీర్లతో నిర్వహింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక యాప్ సిద్ధం చేశారు. కుల గణన సర్వే వివరాల నమోదుకు వాలంటీర్ల సెల్ ఫోన్ లో ప్రత్యేక యాప్ పొందుపరిచారు. సర్వే ప్రారంభం నుంచి ముగింపు వరకు వాలంటీరు ఒకే సెల్ ఫోన్ ను వినియోగించాలి. వివరాలు సేకరించేటప్పుడు గానీ, పూర్తి అయిన తరువాత గానీ, స్క్రీన్ షాట్ లేదా వీడియో రికార్డింగ్ చేసేందుకు వీలు లేకుండా యాప్ ను డిజైన్ చేసారు. సర్వేలో భాగంగా చిరునామా, కుటుంబ సభ్యుల సంఖ్య, వివాహ వివరాలు, కులం, ఉపకులం, మతం, రేషన్ కార్డు నంబర్, విద్యార్హత, ఇంటి వివరాలు, వంట గ్యాస్ తో పాటుగా ఉపాధికి సంబంధించిన వివరాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది.
బీసీ కులాలపై స్పష్టత వస్తుందన్న ప్రభుత్వం
కులగణన ద్వారా బీసీ కులాలకు సంబంధించి ఒక స్పష్టత వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. వృత్తులవారీగా సమగ్ర అధ్యయనం చేపట్టనుంది ఏపీ ప్రభుత్వం. దీంతో బీసీ సామాజిక వర్గాల వారీగా ఉన్న జనాభాపై స్పష్టత రానుంది. ఇలా వివరాలు తెలిస్తే.. పథకాలు సక్రమంగా అమలు చేయవచ్చని అంచనా వేస్తోంది. అయితే కులగణన ప్రక్రియకు తరచూ అవాంతరాలు ఎదురవుతూండటం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.