AP Cabinet: సీఎం చంద్రబాబు 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం - ఏపీ తొలి కేబినెట్ భేటీ నిర్ణయాలివే
Andhrapradesh News: సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక చేసిన తొలి 5 సంతకాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
AP Cabinet Approval For Mega DSC: ఏపీ కేబినెట్ తొలి భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా ఇతర శాఖల మంత్రులు హాజరయ్యారు. మూడున్నర గంటల పాటు మంత్రివర్గం సమావేశం కాగా.. పలు కీలక అంశాలపై చర్చించింది. ఈ క్రమంలో నిరుద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డీఎస్సీకి (Mega DSC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 16,347 పోస్టులను డిసెంబర్ 10లోపు భర్తీ చేయాలని నిర్ణయించింది. జులై 1 నుంచి డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే, కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణపై 2 ప్రతిపాదనలపై భేటీలో చర్చించారు.
65 లక్షల మందికి ఒకేసారి రూ.7 వేల పింఛన్
మెగా డీఎస్సీతో పాటు పింఛన్ల పెంపుపైనా కేబినెట్‌లో చర్చించారు. పింఛన్లు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి పెంచిన పింఛన్లు అందించనున్నారు. ఏప్రిల్ నుంచి ఉన్న పింఛన్ బకాయిలతో కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి రూ.7 వేల పింఛన్ అందనుంది. జులైలో ఒకేసారి 65 లక్షల మంది లబ్ధిదారులు రూ.7 వేల పింఛన్ అందుకోనున్నారు. వారికి ఇంటి వద్దకే పెరిగిన పింఛన్లు అందించనున్నారు.
మరిన్ని నిర్ణయాలివే!
అలాగే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. విజయవాడలో వైఎస్సార్ హెల్త్ వర్శిటీ పేరును ఎన్టీఆర్ వర్శిటీగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 7 అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మైన్, వైన్, పవర్ అండ్ ఫైనాన్స్ వంటి అంశాలపై వైట్ పేపర్ విడుదల చేయనున్నారు. కేబినెట్ ముగిశాక మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పలు అంశాలపై అమాత్యులకు దిశానిర్దేశం చేశారు.
Also Read: AP Cabinet: ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.14 లక్షల కోట్లు - కేబినెట్ ముందుకు ఆర్థిక శాఖ ప్రాథమిక నివేదిక