AP Cabinet: ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.14 లక్షల కోట్లు - కేబినెట్ ముందుకు ఆర్థిక శాఖ ప్రాథమిక నివేదిక
Andhrapradesh News: ఏపీకి ఇప్పటివరకూ రూ.14 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు ఆర్థిక శాఖ రాష్ట్ర తొలి కేబినెట్ ముందు ఉంచింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గం సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఆర్థిక శాఖ కీలక నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ అన్నీ కలుపుకొని రూ.14 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు రాష్ట్ర కేబినెట్ (AP Cabinet) ముందు ప్రాథమిక నివేదిక ఉంచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం మంత్రివర్గం తొలిసారిగా సమావేశమైంది. ఈ భేటీలో సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చించనున్నారు. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు.. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్లు రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్‌పై తొలి 5 సంతకాలు చేశారు. ఈ సమావేశంలో వీటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
సూపర్ సిక్స్ పథకాలపై..
అలాగే, అటు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాల అమలు.. అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతిలో చంద్రబాబు పర్యటించారు. ఈ క్రమంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు వీలుగా నిధుల సమీకరణపైనా చర్చించనున్నారు. జులై నెలాఖరులోగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండడంతో.. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్య అంశాలపై సైతం చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Pensions in AP: పింఛన్లపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, జులై 1న ఇంటి వద్దే పంపిణీ - మంత్రి ప్రకటన