AP Budget Highlights: పోలవరం పూర్తిపై బడ్జెట్‌లో కీలక ప్రకటన, ప్రాజెక్టు పూర్తిపై క్లారిటీ
AP Budget 2022-23: ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్ 2022-23 కోసం నీటి పారుదల రంగానికి గానూ రూ.11,482 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు.
Polavaram Project: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పూర్తిపై బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని తెలిపారు. ఈ ప్రాజెక్టును 2023 నాటికి దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్వాసిన కుటుంబాల పునరావాసంలో చురుకైన పురోగతితో పాటు పునరావాస, పునర్నిర్మాణ కాలనీల నిర్మాణ పనులు కూడా ఏకకాలంలో కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్ 2022-23 కోసం నీటి పారుదల రంగానికి గానూ రూ.11,482 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు.
‘స్వచ్ఛ నీరు - పారిశుద్ధ్యం అనే అంశంలో నీతి ఆయోగ్ ఏపీకి నాలుగో ర్యాంక్ ఇచ్చిందని బుగ్గన వెల్లడించారు. అంతేకాక, ఈ కార్యక్రమానికి అనుగుణంగా దాదాపు 97 శాతం పరిశ్రమలు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిబంధనలు పాటిస్తున్నాయని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాగునీటి సౌకర్యాలు, తాగునీటి కల్పన, పరిశ్రమలకు భరోసా కల్పించేందుకు జలయజ్ఞం కింద చేపట్టిన భారీ ప్రాజెక్టులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు.
సెప్టెంబరు 2020లో ప్రారంభించిన వైఎస్ఆర్ జలకళ కార్యక్రమం కింద మరింత సాగుకు యోగ్యమైన భూమిని సాగులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన, అర్హులైన రైతుల కోసం ప్రభుత్వం 9,187 బోర్ వెల్స్‌ను డ్రిల్ చేయించిందని గుర్తు చేశారు.
వివిధ శాఖలకు కేటాయింపులు ఇవీ..
* వైఎస్ఆర్ రైతు భరోసా - రూ.3,900 కోట్లు
* పెన్షన్ కానుక - రూ.18 వేల కోట్లు
* మైనారిటీ సంక్షేమం - రూ.2,063 కోట్లు
* పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి - 15,846 కోట్లు
* రెవెన్యూశాఖ - రూ.5,306 కోట్లు
* వృత్తి నైపుణ్యం - రూ.969 కోట్లు
* సాంఘిక సంక్షేమం - రూ.12,728 కోట్లు
* రోడ్లు, భవనాలు - 8,581 కోట్లు
* మహిళా శిషు సంక్షేమం - రూ.4,382 కోట్లు
* వైద్య, ఆరోగ్యం - రూ.15,384 కోట్లు
* గృహ నిర్మాణం - 4,791 కోట్లు
* అటవీ శాఖ - రూ.685 కోట్లు
* ఉన్నత విద్య - రూ.2,014 కోట్లు
* సెకండరీ ఎడ్యుకేషన్ - రూ.22,706 కోట్లు
* ఈడబ్ల్యూఎస్ - రూ.10,201 కోట్లు
* పౌర సరఫరాల శాఖ - రూ.3,710 కోట్లు
* వార్డు వాలంటీర్లకు - రూ.3,396 కోట్లు
* నీటి పారుదల, వరదల నివారణ - రూ.11,482.37 కోట్లు
* సైన్స్ అండ్ టెక్నాలజీ - రూ.11.78 కోట్లు
* రవాణా రంగం - రూ.9,617.15 కోట్లు