AP BJP Reaction On Sajjla : మళ్లీ వైఎస్ఆర్‌సీపీ , టీఆర్ఎస్ డ్రామా స్టార్ట్ - సజ్జల సమైక్యవాదంపై ఏపీ బీజేపీ సెటైర్ !
వైఎస్ఆర్‌సీపీ, టీఆర్ఎస్ కలిసి కొత్త రాజకీయ డ్రామా ప్రారంభించాయని ఏపీ బీజేపీ ఆరోపించింది. ఉమ్మడి రాష్ట్రమే కావాలనుకుంటే విభజన అంశాలు వదిలేయాలని సుప్రీంలో ఎందుకు అఫిడవిట్ వేశారో చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
AP BJP Reaction On Sajjla : తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్‌సీపీ, టీఆర్ఎస్ రాజకీయ డ్రామా మొదలు పెట్టాయని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి విమర్శించారు. వీలైతే ఏపీ, తెలంగాణలను కలపడం మంచిది.అదే మా వైఎస్సార్సీపీ విధానమని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. అలాగే ఐతే, సుప్రీంకోర్టులో ఆంధ్ర-తెలంగాణ విభజన కేసులు మూసేయండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పిటీషన్ ఎందుకు వేసిందో చెప్పాలన్నారు. డిల్లీలో ఓక మాట, ఆంధ్రాగల్లీలో ఓకమాట. ప్రజలను ఎందుకు మోసం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు.
అసలు సజ్జల ఏమన్నారంటే ?
విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి పోరాటం చేసింది.. మళ్లీ ఉమ్మడి ఎపి అయితే తొలుత స్వాగతించేది వైసిపినేనని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో వ్యాఖ్యానించారు. ఎపి విభజన చట్టం అసంబద్ధమని సుప్రీంకోర్టులో కేసు ఉంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కోర్టులో మా వాదనలు బలంగా వినిపిస్తామన్నారు. విభజన జరిగిన తీరుపైనే న్యాయస్థానంలో కేసు వేశారు. ఉమ్మడి ఎపి కలిసి ఉండాలన్నదే ఇప్పటికీ మా విధానం. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారనే భావన ప్రజల్లో బలంగా ఉంది. మళ్లీ ఉమ్మడి ఎపి కాగలిగే అవకాశముంటే ఆ విషయంలో ఎంతవరకైనా ముందుకెళ్లేది వైసిపినే. ఏ వేదిక దొరికినా మళ్లీ కలిసేందుకే ఓటు వేస్తాం. విభజన చట్టంలో హామీల అమలుపై పోరాటం చేస్తూనే ఉంటాం. రెండు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే ఏం కావాలని సజ్జల వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రం అయ్యేందుకు ఏ అవకాశం దొరికినా మళ్లీ కలిసేందుకే తమ పార్టీ ఓటు వేస్తుందని ప్రకటించారు.
ఏపీ ప్రయోజనాల కోసం పోరాడటం లేదన్న ఉండవల్లి విమర్శలకు కౌంటర్
బుధవారం మీడియాతో మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్.. రాష్ట్ర విభజన కు వ్యతిరేకంగా తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని.. దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం విభజన అంశం గురించి వదిలేయాలని అఫిడవిట్ వేసిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాడకపోతే సీఎం జగన్ రాజకీయ జీవితం ముగిసిపోయినట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు సి.ఎం జగన్ ఇలా వ్యవహరిస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. విభజన అన్యాయం గురించి మాట్లాడటానికి సి.ఎం జగన్ కు భయం ఎందుకున్నారు. జగన్ పోరాటం చేస్తారని ప్రజల్లో నమ్మకం పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గానే సజ్జల సమైక్యవాదం వినిపించారు.
రాజకీయ వ్యూహంగా భావిస్తున్న బీజేపీ !
రెండు తెలుగు రాష్ట్రాలు పూర్తిగా ్అధికార వ్యతిరేకతలో మునిగిపోయాయనని అందుకే ఇప్పుడు కూడబలుక్కుని సెంటిమెంట్ రేపేందుకు ప్రయత్నిస్తున్నాయని ఏపీ బీజేపీ భావిస్తోంది. అందుకే డ్రామాలు ప్రారంభించారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శిస్తున్నారు. విభజన అంశాల గురించి వదిలేయాలని ఎందుకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారో చెప్పకుండా.. మిగిలిన విషయాలు మాట్లాడటం ఏమిటని ఏపీ బీజేపీ ప్రశ్నిస్తోంది.