Rains in AP: తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం - మోస్తరు వర్షాలకు అవకాశం
Weather Report in Telugu states: పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Rains in AP Due to Severe Cyclone in Bay of bengal: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం (Cyclone) గురువారం తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విశాఖకు (Visakha) తూర్పు - ఆగ్నేయంగా 420 కి.మీ, ఒడిశా పారాదీప్ నకు దక్షిణ - ఆగ్నేయంగా 270 కి.మీ, దిఘా (పశ్చిమ బెంగాల్)కు దక్షిణ-నైరుతి దిశలో 410 కి.మీ, ఖెపుపరా (బంగ్లాదేశ్)కు 540 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఇది ఉత్తర - ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి తుపానుగా మారుతుందని తెలిపారు. ఈ తుపానుకు 'మిధిలి'గా (MIthili) పేరు పెట్టనున్నారు. మాల్దీవులు ఈ పేరును సూచించగా, ఈ తుపాను ఈ నెల 18న తీరం దాటొచ్చని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉంటుందని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. అలాగే, ఏపీ తీరానికి సమీపంలో త్వరలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని, దీంతో పాటు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 28 తర్వాత రాష్ట్రంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు
వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాలో శుక్ర, శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు. అటు రాయలసీమ ప్రాంతంలో శుక్ర, శనివారాల్లో వర్షాలు పడతాయని వెల్లడించారు. శ్రీకాకుళం, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు.
తెలంగాణలో పొడి వాతావరణమే
ఇక తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఎలాంటి వర్ష సూచన లేదని, ఉదయపు వేళల్లో పొగ మంచు వాతావరణం ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఉపరితల గాలులు ఈశాన్య దిశల నుంచి గంటకు 6 - 10 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రైతుల ఆందోళన
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో రైతులు కూడా అప్రమత్తం ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు కురుస్తాయన్న అధికారుల హెచ్చరికలతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కొన్ని జిల్లాల్లో వరి కోస్తుండగా, మరికొన్ని చోట్ల కోసిన వరి పంటను కళ్లాల్లో కుప్పలుగా పెడుతున్నారు. వాటిపై గడ్డి, ప్లాస్టిక్ టార్పన్‌లు కప్పి జాగ్రత్త చేస్తున్నారు. కోతలు, నూర్పిడి సమయంలో వర్షం కురిస్తే తమకు తీవ్ర నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు. వాతావరణ పరిస్థితులతో ప్రస్తుతానికి వరి పంట కోతలు చేపట్టవద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కాగా, ఈ ఏడాది వాతావరణ మార్పుల కారణంగా వరి దిగుబడి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read: Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రిపరేషన్‌లో మరో ముందడుగు, కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ