Rains in AP, Telangana: వాయుగుండం ప్రభావంతో ఏపీలో సీమ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో కొనసాగుతున్న ఎల్లో వార్నింగ్
Rains In AP And Telangana | దేశంలో నైరుతి రుతుపవనాల కాలం ముగిసింది. ఇక ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో వర్షాలు పడతాయి.
నైరుతి రుతుపవనాలు మన దేశం నుంచి ఉపసంహరించుకున్నాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రక్రియ మంగళవారంతో పూర్తయింది. అదే సమయంలో ఆగ్నేయ ద్వీపకల్ప భారతదేశంలో అక్టోబర్ 15న ఈశాన్య రుతుపవనాల వర్షపాతం ప్రారంభమైంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో గుర్తించిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారుతోంది. అల్పపీడనం రాగల 24 గంటల్లో పశ్చిమ- వాయువ్య దిశగా పయనించి వాయుగుండముగా నైరుతి బంగాళాఖాతములో బలపడే అవకాశం ఉందని వాతారణశాఖ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండము మరో 24 గంటల్లో పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు ప్రయాణించనుంది.
ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వరకు విస్తరించి ఉంది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్ది నైరుతి దిశగా వంగి ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనన్నాయి. ఏపీకి రెడ్ అలర్ట్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ లను భారత వాతావరణశాఖ జారీ చేసింది. రాయలసీమలోని వైఎస్సార్ జిల్లా, అన్నమయ్య, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచనతో రెడ్ అలర్ట్ జారీ చేసి ప్రజలతో పాటు అధికారులను అమరావతి వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
District forecast of Andhra Pradesh dated 15-10-2024 #IMD #APWeather #APforecast #MCAmaravati #CEOAndhra #AndhraPradeshCM #dgpapofficial #IMDWeather pic.twitter.com/n8SCfPBTzQ
— MC Amaravati (@AmaravatiMc) October 15, 2024
బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. దాంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఏపీలోని మిగతా జిల్లాలైన ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు మోస్తరు వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు రెండు రోజులపాటు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని అధికారలు హెచ్చరించారు.
తెలంగాణలో 2 రోజులపాటు వర్షాలు..
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో బుధవారం నాడు నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) October 15, 2024
బుధవారం రాత్రి ఆదిలాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాల పడతాయి. తెలంగాణలో గురువారం నాడు కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.