(Source: ECI/ABP News/ABP Majha)
AP Education Policy:ఇకపై ఏపీలో 6రకాల స్కూళ్లు….
ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పున:ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం....రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న నూతన విద్యా విధానాన్ని అనుసరించి పలు మార్పులు చేస్తోంది...అందులో భాగంగా ఇకపై ఆరు రకాల స్కూల్స్ ఉండనున్నాయి..
ఏపీలో అమలుకానున్న నూతన విద్యావిధానాన్ని అనుసరించి స్కూళ్లను ఆరు రకాలుగా వర్గీకరించారు. పీపీ-1 నుంచి 12వ తరగతి వరకూ ఆరు రకాల స్కూల్స్ ఉంటాయి.
అవేంటంటే…
1) శాటిలైట్ పౌండేషన్ స్కూల్స్ ( పీపీ-1, పీపీ-2)
2) పౌండేషన్ స్కూల్స్ (పీపీ-1, పీపీ-2, 1, 2 తరగతులు)
3) పౌండేషన్ ప్లస్ స్కూల్స్ (పీపీ-1, పీపీ-2, 1, 2, 3, 4, 5 తరగతులు)
4) ప్రీహైస్కూల్స్ (పీపీ-1, పీపీ-2, 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు)
5) హైస్కూల్స్ (3 నుంచి 10వ తరగతి వరకూ)
6) హైస్కూల్ ప్లస్ ( 3 నుంచి 12వ తరగతి వరకూ)
అంగన్ వాడీలన్నీ శాటిలైట్ పౌండేషన్ స్కూల్స్‌గా రూపాంతరం చెందనున్నాయి. ఇక్కడి నుంచే ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభమవుతుంది. అక్కడ ఎస్‌జీటీ టీచర్లు పర్యవేక్షణచేస్తారు. ఇక ఫౌండేషన్ స్కూల్స్ కిలోమీటరు లోపలే ఉంటాయి. మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూల్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఉపాధ్యాయులను అత్యంత సమర్ధవంతంగా ఉపయోగించుకోవడమే నూతన విధానంలో ప్రధాన లక్ష్యమన్నారు సీఎం జగన్. కొత్త విధానంలో 5వ తరగతి వరకు 18 సబ్జెక్టులును బీఈడీ, పీజీ చేసిన ఉపాధ్యాయులతో సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధన అందించబోతున్నామని, తద్వారా పిల్లలకు ఫోకస్డ్ ట్రైనింగ్ వస్తుందని, విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తి శాస్త్రీయంగా ఉండేలా రూపొందిస్తున్నామని, ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ రాబోతున్నారని సీఎం తెలిపారు. పౌండేషన్ స్కూల్స్, నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాలు, పిల్లల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. నాడు - నేడు, నూతన విద్యావిధానంకోసం సుమారు 16వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని, దీని ద్వారా సాధించబోయే లక్ష్యాలు స్పష్టంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఇక కరోనా విలయం కారణంగా వరుసగా రెండేళ్లు పరీక్షలు నిర్వహించకుండానే టెన్త్ విద్యార్థులను పాస్‌చేసిన నేపథ్యంలో కొన్ని రిక్రూట్‌మెంట్లలో మార్కులను పరిగణలోకి తీసుకుంటున్నారని, దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న అంశాన్ని అధికారులు ప్రస్తావించగా, 2020 టెన్త్ విద్యార్థులకూ కూడా మార్కులు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా మార్కులు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అలాగే, 2021 టెన్త్ విద్యార్థులకూ మార్కులు ఇవ్వనున్నన్నారు. స్లిప్‌టెస్టుల్లో మార్కులు ఆధారంగా 70శాతం మార్కులు, ఫార్మెటివ్ అసెస్‌మెంట్ ఆధారంగా మిగిలిన 30శాతం మార్కులు ఇవ్వాలని, మొత్తం మార్కులు ఆధారంగా గ్రేడ్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి అన్ని రకాల స్కూళ్లను పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు అంతా సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే బడులను నడుపుతామని, దీనికి సంబంధించి ఇప్పటికే టీచర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్లు వేయించే ఏర్పాట్లు కూడా చేశామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇప్పటికే స్పష్టం చేశారు.