Andhra Pradesh: 22ఏ సమస్యల పరిష్కారంలో ఆలస్యం - చంద్రబాబు సైతం అసహనం - ఏపీ రెవిన్యూలో ఏం జరుగుతోంది?
Andhra : ఏపీలో రెవిన్యూ సమస్యలు లక్షల్లో ఉన్నాయి. వాటిలో అత్యధికం గత ప్రభుత్వంలో కారణం లేకుండా 22ఏలో ఆస్తుల్ని పెట్టడం వల్ల ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఎందుకు వెనుకాడుతున్నారు ?
Andhra Offiers delaying the exclusion of common peoples property from 22A : రెవిన్యూ సమస్యల పరిష్కారం విషయంలో జరుగుతున్న ఆలస్యంపై ప్రజలకు కూడా సహనం ఉండాలి కదా అని ఇటీవల చంద్రబాబునాయుడు అధికారులను ఉద్దేశించి అన్నారు. తమ భూములను, ఆస్తులను అక్రమంగా గత ప్రభుత్వ హయాంలో నిషేధ భూముల జాబితా 22Aలో చేర్చారని వాటిని తీసేయాలని అడుగుతున్నా అధికారులు ఆలస్యం చేస్తున్నారని ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో చంద్రబాబునాయుడు ఈ అంశంపై స్పందించారు.సీఎం అలా వ్యాఖ్యానించిన తర్వాత రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులతో రివ్యూ చేశారు. త్వరలోనే పేదలకు సంబంధించిన 22ఏ సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు. కానీ ఈ త్వరలోనే అన్న మాట వింటేనే ప్రజలకు విరక్తి వచ్చేస్తోంది. ఎంత కాలమో తెలియకపోవడమే దీనికి కారణం.
రెవిన్యూ సదస్సుల్లో లక్షల సంఖ్యలో ఫిర్యాదులు
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రెవిన్యూ సదస్సులు పెడితే లక్షల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని అధికారులు ప్రకటించారు. వాటిలో అత్యధికం 22ఏలో స్థలాలు ఉండటమే. గుంటూరు నగరంలోని లక్ష్మిరఘురామయ్య నగర్ అనేకాలనీలో ఇళ్లకు ఇరవై ఏళ్ల కిందటే కొనుగోలు ఒప్పందం కింద గజానికి చొప్పు రేటు కట్టి ప్రభుత్వం విక్రయించింది. అయితే ఆ కాలనీని వైసీపీ హయాంలో 22ఏ కింద చేర్చేశారు. అలా చేర్చడానికి ఎలాంటి కారణాలు లేవు.ఇలాంటివి చాలా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వాటి విషయంలో అభ్యంతరాలు ఉండటానికి కూడా అవకాశం లేదు. అలాంటి సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపిస్తే ప్రజలు సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది.
పేదల ఆస్తుల విషయంలో వెంటనే స్పందించాల్సిన అవసరం
రెవిన్యూ సమస్యలను పరిష్కరించడం క్లిష్టమే. అయితే ఇలాంటి సమస్యలన్నీ అధికారుల వల్లనే వస్తున్నాయని బాధితులు గుర్తుచేస్తున్నారు. వారు రికార్డులు తారుమారు చేయడం లేకపోతే రాజకీయ నేతలతో కుట్రపన్ని 22ఏలో నమోదు చేయడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటున్నారు. ఏదైనా ఖాళీ స్థలం .. అసైన్డ్ చేసి అది చేతులు మారితే దాన్ని నిషేధ ప్రాంతంలో పెట్టినా ఓ అర్థం ఉంటుంది కానీ.. ఇరవై ఏళ్ల కిందట చట్టబద్దంగా రిజిస్ట్రేషన్లు చేసిచ్చిన కాలనీని కూడా ఆ జాబితాలో చేర్చడం అంటే అధికారదుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఇలాంటి సమస్యలను కూడా వేగంగా పరిష్కరించకపోతే ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది.
సీఎం మాటల్ని సీరియస్‌గా తీసుకోరా ?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకూడా అదే చెబుతున్నారు. ఎప్పటికే పరిష్కరిస్తామంటే అంత కాలం సహనంతో ఎలా ఉంటారని ఆయన అంటున్నారు. అన్నిసమస్యలు ఒకలాగే ఉండకపోవచ్చు కానీ.. పేదల ఆస్తుల విషయంలో మాత్రం తక్షణం స్పందించి.. వివాదాలను పరిష్కరించాల్సిన అవసరాన్ని మాత్రం ఆయా వర్గాల ప్రజలు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వానికి కూడా ఇది చాలా ముఖ్యమైనదని అంటున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి మాటల్ని .. మంత్రి అనగాని సత్యప్రసాద్ సీరియస్ గా తీసుకుని అక్రమంగా 22ఏలో పెట్టిన ఇళ్లను.. స్థలాలను తప్పించాలని బాధితులు కోరుతున్నారు.