Andhra News: 'అధికారం అండగా రూ.4 లక్షల కోట్ల ప్రజాధనం లూటీ' - సీఎం జగన్ పై అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
Atchennaidu Comments: సీఎం జగన్ అధికారాన్ని అడ్డు పెట్టుకుని రూ.4 లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా మారారని అన్నారు.
Atchennaidu Criticise CM Jagan: తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని సీఎం జగన్ రూ.లక్షల కోట్లు దోచుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ఒకప్పుడు పేదరికంలో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5 లక్షల కోట్లు ఆర్జించింది. 2003లో వైఎస్ కుటుంబం రూ.9.19 లక్షలకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసింది. 2004 ఎన్నికల సమయంలో డబ్బుల్లేక ఇబ్బంది పడింది. ఆ టైంలో వారి ఇల్లు అమ్మేందుకు కూడా సిద్ధపడ్డారు. పాదయాత్రతో వైఎస్ ప్రజలను మభ్యపెట్టారు. అధికారంలోకి వచ్చాక పరిస్థితి అంతా మారిపోయింది.' అని వెల్లడించారు.
'హామీల పేరుతో దోపిడీ'
ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్, సీఎం అయ్యాక రూ.4 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. దేశంలోనే సంపన్న సీఎంగా మారారని మండిపడ్డారు. రాష్ట్రంలో కనీసం అభివృద్ధి లేదని, అధికారం అండతో యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'సీబీఐ వాయిదాలకు వెళ్లడం లేదు'
'2004లో వైఎస్ అధికారంలోకి వచ్చాక, జగన్ రూ.లక్ష కోట్లు సంపాదించారు. క్విడ్‌ప్రోకో కింద సీబీఐ 11 కేసులు నమోదు చేసింది. 8 ఛార్జ్‌షీట్లు దాఖలు చేసి రూ.45 వేల కోట్ల ఆస్తులను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక సీబీఐ వాయిదాలకు హాజరు కావడం లేదు.' అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో పేపర్లు, సిమెంట్ కంపెనీలు పెట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ గుర్తు మీద గెలిచిన ఎంపీనే జగన్ అవినీతిపై విచారణ జరపాలని కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని, అధికారంలోకి వచ్చాక 341 సార్లు కేసుల్లో వాయిదా కోరి న్యాయస్థానానికి వెళ్లకుండా మోసం చేశారన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. సీఎం జగన్ కేసుల్లో న్యాయ సమీక్ష చేయించాలని డిమాండ్ చేశారు. అవినీతిపై కోర్టులో వేసిన నోటీసుపై సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
27 నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర
మరోవైపు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కాబోతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పాదయాత్రను నిలిపేసిన ఆయన తిరిగి ప్రారంభించనున్నారు. ఈ మేరకు టీడీపీ రూట్ మ్యాప్ విడుదల చేసింది. ఈ యాత్ర ఉమ్మడి తూ.గో జిల్లాలోని రాజోలు మండలం పొదలాడ నుంచి ప్రారంభం కానుంది. చంద్రబాబును అరెస్టు రోజే లోకేశ్ తన యాత్రను పొదలాడలో నిలిపివేశారు. దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి పాదయాత్ర ప్రారంభం కానుంది. తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో లోకేశ్ పాదయాత్ర ముగియనుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
Also Read: Chandrababu Naidu: రేపు ఢిల్లీకి చంద్రబాబు, సిద్ధార్థ్ లుత్రా కుమారుడి రిసెప్షన్‌కు హాజరు