Andhra News: 'వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికీ రూ.2,500' - తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్
CM Jagan: 'మిగ్ జాం' తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. బాధితులను ఆదుకుంటామని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు.
CM Jagan Visit in Michaung Cyclone Affected Areas: సీఎం జగన్ (CM Jagan) తుపాను ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి (Tirupati), బాపట్ల (Bapatla) జిల్లాల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్ లో తిరుపతి జిల్లాకు చేరుకున్న ఆయన, అధికారులతో కలిసి వాకాడు మండలం విద్యానగర్ వెళ్లారు. అనంతరం బాలిరెడ్డి పాలెం (Balireddypalem) వెళ్లి అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగిన ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి బాధిత గ్రామస్థులు, రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తుపాను ప్రభావంపై ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. తర్వాత మురుప్రోలు వారిపాలెం, కర్లపాలెం, బుద్దాం గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు నేరుగా మాట్లాడనున్నారు. అంతకు ముందు తిరుపతి జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ ద్వారా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
తిరుపతి జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం శ్రీ వైఎస్ జగన్ ఏరియల్ సర్వే. pic.twitter.com/O1jMRhLNEC
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 8, 2023
'ప్రతి రైతునూ ఆదుకుంటాం'
మిగ్ జాం తుపాను ప్రభావంతో నష్టపోయిన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఈ సందర్భంగా సీఎం జగన్ తెలిపారు. బాలిరెడ్డిపాలెంలో తుపాను బాధిత గ్రామస్థులు, రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఈ గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించే పనులు చేపడతామని, వారం రోజుల్లో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికీ రూ.2,500 ఇస్తామని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని అన్నారు. వర్షం వల్ల రంగు మారిన, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, అన్నదాతలు ఆందోళన చెందాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు.
వాలంటీర్ల ద్వారా సాయం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా సీఎం జగన్ బాధితుల్లో ధైర్యం నింపారు. 'నాలుగైదు రోజుల్లో భారీ వర్షం కురిసింది. మనకు వచ్చిన కష్టం వర్ణనాతీతం. వరుస వర్షాలతో రైతులు నష్టపోయారు. 92 రిలీఫ్ కేంద్రాలు పెట్టాం. 60 వేల మంది బాధితులకు 25 కేజీల రేషన్ బియ్యంతో పాటు నిత్యావసరాలను పంపిణీ చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మన వద్ద వాలంటీర్ వ్యవస్థ ఉంది. ప్రతి ఇంటికీ వాలంటీర్ వచ్చి రూ.2,500 ఇస్తారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. వారికి 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తాం. యుద్ధ ప్రాతిపదకిన విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్నాం. స్వర్ణముఖి నదిపై హైలెవల్ వంతెన నిర్మిస్తాం. అవసరమైన వారు జగనన్న హెల్ప్ లైన్ ను సంప్రదించాలి. వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తాం' అని సీఎం జగన్ వివరించారు.
Also Read: Chandrababu Naidu: ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు - 'మిగ్ జాం' ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల పర్యటనa