AP Employees Dharna : నాలుగున్నరేళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారు - 27న చలో విజయవాడకు ఏపీ ఉద్యోగ సంఘాల పిలుపు !
AP Employees : ఏపీ సీఎం జగన్ నాలుగున్నరేళ్లుగా మోసం చేస్తున్నారని ఉద్యోగులు మండిపడ్డారు. జేఏసీగా ఏర్పడి నిరసనలు ప్రారంభించారు.
AP Employees Dharna : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆందోళన నిర్వహించారు. గుంటూరులో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్‌రావు (Bandi Srinivas Rao) పాల్గొన్నారు. మాట్లాడుతూ 12వ పీఆర్సీ (PRC) , ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లుగామోసంచేస్తోందని మండిపడ్డారు.
మరింత ఉధృతంగా ఉద్యమం
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన బకాయిలే ప్రభుత్వాన్ని అడుగుతున్నామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క డీఏ ఇచ్చిన దాఖలాలు లేవని ఆరోపించారు. ఉద్యోగులకు రావాల్సిన 26వేల కోట్ల రూపాయలను ఇవ్వడం లేదని మండిపడ్డారు. జీతాలను సకాలంలో ఇవ్వకుండా ఉద్యోగులను ఇబ్బందులపాలు చేస్తుందని అన్నారు. గత్యంతరం లేని పరిస్థితిల్లో ఉద్యోగులు ఆందోళన చేపడుతున్నారని ఆయన వెల్లడించారు
12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలి ! .
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి…12వ పీఆర్సీని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల14వ తేదీ నుంచి తాలూకా స్థాయి నుంచి ఉద్యోగులు నిరసనకు దిగారని తెలిపారు. ప్రభుత్వాన్ని తమకు న్యాయంగా రావలసిన 12వ పీఆర్సీ, బకాయి డీఏలు ఇవ్వాలని కోరడం నేరమా అని బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఇప్పటికే రూ.26వేల కోట్లు బకాయిలు ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని అన్నారు. చివరకు జీపీఎఫ్ నిధులను సైతం లేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. అంతేకాకుండా.. మెడికల్ బిల్లులు సైతం రావడం లేదు, జీవోలు విడుదల చేస్తున్నారు కానీ నిధులు మాత్రం రావడం లేదని అన్నారు. పీఆర్సీ కోసం పోరాటం చేస్తే ఇంతవరకు వాటిని కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తూనే ఉందని పేర్కొన్నారు.
27న చలో విజయవాడకు ఉద్యోగ సంఘాల పిలుపు
ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు, IR ఇవ్వకపోడంతో ఏపీ జేపీసీ ఉద్యమ బాట పట్టింది. ఈ క్రమంలో ఈనెల 27వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం చేపడుతామని జేఏసీ నేతలు చెబుతున్నారు.