CM Chandrababu: ఊహించిన దాని కంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు - తొలి అడుగు కార్యక్రమంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Andhra CM: పాలనకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక సదస్సు నిర్వహించింది. ఊహించిన దాని కంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చంద్రబాబు తెలిపారు.

Chandrababu : అన్నీ చేసేశామని చెప్పట్లేదని.. ఊహించిన దాని కంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏపీలో అమలు చేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. "సుపరిపాలనలో తొలి అడుగు" పేరిట ఏడాది పాలనపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్ మూడు ముక్కలాటతో ఏపీకి రాజధాని లేకుండా చేశారన్నారు. నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని .. వైసీపీ ప్రభుత్వ విధానాలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో స్వర్ణాంధ్ర విజన్- 2047ను లక్ష్యంగా పెట్టుకున్నామని.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించామన్నారు. మూడు పార్టీలు కలిసి అధికారంలో ఉన్నా ఎలాంటి సమస్య రాలేదని చెప్పారు. ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకుంటామన్నారు.
తమ ప్రభుత్వం "సుపర్ సిక్స్" హామీలను వేగంగా అమలు చేస్తోందని, పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా 67 లక్షల మంది తల్లులకు రూ.13,000 ప్రతి బిడ్డకు సంవత్సరానికి, అలాగే విద్యా సంస్థల అభివృద్ధికి రూ.2,000 అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. గత YSRCP ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసిందని, రూ.24,000 కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం క్లియర్ చేసిందని, రూ.3 లక్షల కోట్ల బడ్జెట్‌తో పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని వివరించారు. ఒక సంవత్సరంలో రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, 8.5 లక్షల ఉద్యోగాల సృష్టి లక్ష్యమని చెప్పారు.
మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, చట్టం ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుండి ప్రారంభమవుతుందని, దీపం-2 పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని చెప్పారు . రాష్ట్రంలో ఫెర్టిలిటీ రేట్ (TFR) 1.5కి పడిపోయిందని, జనాభా స్థిరీకరణకు 2.1 TFR అవసరమని, జపాన్ వంటి దేశాల్లో జనాభా క్షీణత వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్ , యూపీల్లో పెరిగినంత వేగంగా జనాభా పెరగడం లేదన్నారు. పోలవరం పూర్తయితే ఏపీకి నీటి సమస్య సమసిపోతుందని వెల్లడించారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని ప్రకటించారు. వైసీపీ హయాంలో రెవెన్యూ రికార్డులను అస్తవ్యస్థం చేశారని ఆరోపించారు. 213 అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం పెడుతున్నామని ఉద్ఘాటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,400 కోట్లు సాయం చేశారని గుర్తుచేశారు. అమరావతిని మళ్లీ పట్టాలెక్కించాం.. పూర్తి చేస్తామని మాటిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.12,500 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. విశాఖపట్నం రైల్వేజోన్ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. తల్లికి వందనం హామీని పూర్తిగా నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ సదస్నును చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధరేశ్వరి, లోకేష్ ప్రారంభించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్, ఉన్నతాధికారులు, హెచ్‌వోడీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆ తర్వాత రెండో ఏడాది లక్ష్యాలపై సమావేశంలో మాట్లాడారు. అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో తొలిసారి ప్రత్యేకంగా ఈ సమావేశం నిర్వహించారు.





















