Anantapur News: అనంతపురం జిల్లాలో పత్తాలేని వైసీపీ నేతలు! అంతా ఎక్కడికక్కడ సైలెంట్!
YSRCP Anantapur News: వైఎస్ఆర్ సీపీ అధికారంలో ఉండగా అనంతపురంలో ఓ వెలుగు వెలిగిన నేతలు సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Telugu News: ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ గత ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నియోజకవర్గ ఇన్చార్జిలు మాజీ ఎమ్మెల్యేలు సైతం కనిపించడం లేదని వైసీపీ కార్యకర్తలే బహిరంగంగా చర్చించుకుంటున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చలామణి అయిన నేతలు ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేకపోవడం కూచింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతా తామే మేము లేకుంటే పార్టీ నే లేదు అన్న రీతిలో ఉన్న నేతలు సైతం సైలెంట్ అయిపోవడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి చెప్పుకోలేని స్థితిలో ఉంది.
అభ్యర్థుల మార్పుతో పార్టీ అధోగతి
2024 ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీలో అంధకారం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా నాయకత్వం అనేది లేకుండా పోయింది. దీంతో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టింది. వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష పార్టీ కన్నా దిగువ స్థాయికి పడిపోవడంతో రాష్ట్ర పార్టీ నేతలు సైతం బిక్కమొహం వేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం మరింత దారుణంగా మారింది. జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు లోక్సభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పైల నరసింహయ్య, సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా నవీన్ నిచ్చల్ ఉన్నారు. వీరు సైతం పార్టీ నేతలకు అందుబాటులో లేకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల్లోని అభ్యర్థులను మార్పులు చేర్పులు చేశారు. ఇవేవీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పనిచేయలేదు కేవలం ఒక్కటంటే ఒక్క సీటు కూడా జిల్లాలో దక్కని పరిస్థితి ఎదురైంది.
ముఖ్యంగా స్థానికంగా ఉన్న నాయకులను కాదని పక్క నియోజకవర్గాలకు చెందిన వారిని తీసుకువచ్చి పలు స్థానాల్లో పోటీలో నిలపడంతో దాదాపుగా అన్నిచోట్ల పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ప్రధానంగా అనంతపురం జిల్లాలోని కళ్యాణ్ దుర్గం కు చెందిన ఉషశ్రీ చరణను పెనుగొండలో పోటీలో నిలిపారు. హిందూపురంలో స్థానిక నాయకుడు వైసీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్లో పక్కనపెట్టి దీపిక వేణు రెడ్డిని రంగంలోకి దింపారు. అదే విధంగా మడకశిరలో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పే స్వామి స్థానంలో సామాన్య వ్యక్తిగా ఉన్న ఈర లక్కప్ప తో పోటీ చేయించారు. కదిరిలో సైతం సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని కాదని మైనార్టీ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ను తెచ్చిపెట్టారు. పుట్టపర్తిలో తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్న శ్రీధర్ రెడ్డిని కొనసాగించారు. ధర్మవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డిని, రాప్తాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుడుర్తి ప్రకాష్ రెడ్డిని కొనసాగించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
పత్తా లేకుండా శాంతమ్మ
హిందూపురం లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసిన శాంతమ్మ టికెట్ తెచ్చుకొని పోటీ చేశారు. ఫలితాలు వెలువడగానే పత్త లేకుండా పోయారు. కళ్యాణదుర్గంలో అనంతపురం ఎంపీ రంగయ్య పోటీ చేశాడు, ఉరవకొండలో విశ్వేశ్వర్ రెడ్డి, అనంతపురం అర్బన్ లో అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, మడకశిర నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కాదని కొత్త వ్యక్తి అయిన వీరాంజనేయులు బరిలో దించారు. రాయదుర్గం నియోజకవర్గం లోను సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి ని కాదని మెట్టు గోవింద్ రెడ్డిని బరిలో దింపారు. ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో చేసిన ప్రయోగాలన్నీ బెడిసి కొట్టాయి.
నియోజకవర్గాల్లో కనపడిని వైఎస్ఆర్ సీపీ నేతలు
14 అసెంబ్లీ స్థానాలు రెండు లోక్ సభ స్థానాలకు గాను ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేని పరిస్థితికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో పడిపోయింది. దీంతో డీలాపడ్డ నేతలు ఇంతవరకు కూడా నియోజకవర్గాల్లోని ప్రజలు గాని కార్యకర్తలు గాని వైసీపీ పార్టీ నేతలు పట్టించుకోవడం లేదు. ఎన్నికల కౌంటింగ్ ముగిసి దాదాపు నెలరోజులు ముగిసినప్పటికీ ఇప్పటికీ కూడా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా చలామణి అయిన నాయకులు వైయస్సార్సీపి నేతలు కార్యకర్తలకు అందుబాటులోకి రాలేదు. అడపాదడప వచ్చిపోతున్న ఇద్దరు ముగ్గురు నేతిలో ఉన్నారు తప్ప మిగతా వారంతా కూడా అసలు ఎక్కడున్నారో కూడా ఆ పార్టీ నేతలకే తెలియని పరిస్థితి నెలకొంది. తాడిపత్రి నియోజకవర్గంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గంలోకి రాకూడదని కోర్టు ఆర్డర్ ఉంది.
ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మొదట్లో నేను అందుబాటులో లేని చెప్పినప్పటికీ అడపాదడపా నియోజకవర్గంలో కనిపించి వెళ్తున్నారు. కదిరి నియోజకవర్గంలో అయితే మక్బూల్ బాషా ఇప్పటివరకు ఎవరికీ అందుబాటులోకి రావట్లేదు. హిందూపురంలో దీపిక రెడ్డి అదే పరిస్థితి.. గుంతకల్లు నియోజకవర్గం లో వెంకటరామిరెడ్డి, అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన అనంత వెంకట్రామిరెడ్డి, సింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వీరాంజనేయులు, పుట్టపర్తి నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే దిద్దెకొండ శ్రీధర్ రెడ్డి, రాప్తాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇలా నేతలందరూ కూడా కార్యకర్తలకు అందుబాటులో లేరన్నది బహిరంగ రహస్యం. ఇది ఇలాగే కొనసాగితే పార్టీకి పెద్ద నష్టమే చేకూర్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.