Anantapur News : తలారిచెరువు గ్రామంలో వింత ఆచారం, పౌర్ణమి నాడు ఊరంతా ఖాళీ!
Anantapur News : మాఘమాస పౌర్ణమి నాడు ఆ గ్రామంలో అగ్ని వెలిగించరు, గ్రామస్థులందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఊరు శివారులోని దర్గాకు వెళ్లి అక్కడ ఒక రోజు గడుపుతారు.
Anantapur News : ఆ గ్రామంలో మాఘ మాసం పౌర్ణమి రోజు అగ్గి వెలిగించరు. పౌర్ణమి రోజు గ్రామస్థులు తమ కుటుంబసభ్యులతో పాటు పెంపుడు జంతువులను తీసుకొని గ్రామాన్ని ఖాళీ చేస్తారు. మరుసటి రోజు తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారిచెరువులో గ్రామంలో అగ్గిపాడు అనే పేరుతో ఈ వింత ఆచారం కొనసాగిస్తున్నారు.
అసలేంటీ ఆచారం?
అగ్గిపాడు ఆచారాన్ని వనభోజనాలుగా మార్చుకుని గ్రామస్థులందరు ఒకచోట చేరి ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతున్న సంఘటన తాడిపత్రి మండలంలోని తలారిచెరువులో చోటుచేసుకుంది. తాడిపత్రి పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో పెన్నా సిమెంట్స్ ఫ్యాక్టరీ పక్కనే ఊరుచింతల పంచాయతీలోని మజారాలో ఉన్న గ్రామం తలారిచెరువు. 400 సంవత్సరాల క్రితం గ్రామంలో ఓ బ్రాహ్మణుడు తన అనుచరులతో కలిసి గ్రామంపై దాడి చేసి దొరికిన ధాన్యాన్ని, ధనాన్ని దోచుకుని పోతుండగా గ్రామస్థులు దాడి చేసి అతన్ని తీవ్రంగా కొట్టి హతమార్చడంతో, ఆ బ్రాహ్మణుడు మరణించే ముందు గ్రామం సుభిక్షంగా ఉండదని, పుట్టిన వెంటనే బిడ్డలు మరణిస్తూ కరువు కాటకాలతో అల్లాడుతూ నష్టపోవాలని శపించినట్లు చెబుతారు గ్రామస్థులు. అప్పటి నుంచి గ్రామంలో పంటలు పండక, పుట్టిన బిడ్డలు మరణిస్తుండడంతో కొంత మంది మేధావులు చిత్తూరు జిల్లా చంద్రగిరి పట్టణానికి వెళ్లి అక్కడి జ్యోతిష్యున్ని కలవాలని సలహా ఇచ్చారు. ఆ జ్యోతిష్యున్ని కలిసిన గ్రామ పెద్దలకు జ్యోతిష్యడు గ్రామంలోని వారు మాఘచతుర్థశి అర్ధరాత్రి నుంచి పౌర్ణమి అర్ధరాత్రి వరకు ఆ గ్రామంలో ఎలాంటి అగ్గి గాని, వెలుతురు గాని లేకుండా గ్రామం వదిలి దక్షిణంవైపు వెళ్లాలని చెప్పారు. ఆయన సలహా మేరకు అగ్గిపాడు ఆచారాన్ని పాటిస్తూ గ్రామానికి దక్షిణంవైపు ఉన్న హాజవలి దర్గాకు వెళ్లి ఒక రోజు అక్కడే గడిపి ఆటపాటలు, వనభోజనాలతో సరదాగా చేసుకుంటున్నారు. గ్రామంతో పాటు వారి బంధువులు అందరు కలిసి హాజివలి దర్గాలో పశువులు, పిల్లాపాపలు, ముసలివారితో సహా గ్రామం వదిలి మాఘచతుర్ధశి అర్ధరాత్రి నుంచి మాఘపౌర్ణమి అర్ధరాత్రి వరకు గ్రామంలో అగ్గిగాని, లైట్లుగాని వెలిగించకుండా ఆచారం కొనసాగిస్తున్నారు.
మరో కథ ప్రచారంలో
మరొక జానపద పురాణం ప్రకారం, ఒక శతాబ్దం క్రితం రెండు వర్గాలు యుద్ధం చేశాయి. ఈ యుద్ధంలో పిల్లలు, మహిళలు, స్థానిక పూజారులతో సహా వందలాది మంది మరణించారు. ఆ యుద్ధాన్ని ఊరికి వచ్చిన అశుభ శకునం అని, పూజారుల శాపం వల్లే ఇలా జరిగిందనే గ్రామస్థుల్లో నమ్మకం ఏర్పడింది. గ్రామ పెద్దలు ఒక సాధువును సంప్రదించి, అతని సలహా మేరకు, ఈ యుద్ధం జరిగిన మాఘ మాసంలో పౌర్ణమి రాత్రి యుద్ధ భూమిలో ఆచారాలను పాటించాలని నిర్ణయించుకున్నారు. దుష్టశక్తులను వెళ్లగొట్టేందుకు ప్రతి మాఘ పౌర్ణమి నాడు గ్రామాన్ని విడిచి వెళ్లాలని ప్రధాన పూజారి సలహాను గ్రామస్థులు నేటికీ పాటిస్తున్నారు. యుద్ధం జరిగిన ప్రదేశంగా చెప్పుకుంటున్న దర్గా వద్ద సమావేశమై రోజంతా అక్కడే ఉంటారు. అప్పటి నుంచి తలారిచెరువు గ్రామస్థులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. కొంతమంది ప్రజలు దీనిని 21వ శతాబ్దంలో కూడా అనుసరిస్తున్న మూఢనమ్మకంగా పేర్కొన్నప్పటికీ, ఈ ఆచారంలోని ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, కుల, మతాలకు అతీతంగా గ్రామస్థులు దర్గా వద్దకు చేరుకుని మత సామరస్యానికి ప్రతీకగా కలిసి ఉండడం. దర్గాకు వచ్చిన గ్రామస్థులందరూ ముందుగా అక్కడ ప్రార్థనలు చేసి, తర్వాత తమ దేవతలను ప్రార్థించటానికి బయలుదేరుతారు. ఆ రోజు బ్రాహ్మణులు కూడా దర్గాలో ప్రార్థనలు చేస్తారు.