Andhra Pradesh Latest News: చంద్రబాబు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయండి- గవర్నర్‌కు వైఎస్‌ఆర్‌సీపీ లేఖ
Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో చట్టవిరుద్ధమైన పాలన సాగుతోందని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. రెండు ఘటనలు వివరిస్తూ ఆయనకు లేఖ రాసింది.

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లోకూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలిస్తోందని తమ నేతలను, మద్దతుదారులను టార్గెట్ చేస్తోందని వైసీపీ ఆరోపించింది. దీనిపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను సరి చేయాలని ఆయనకు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సహా ప్రజాప్రతినిధులు లేఖ రాశారు.
గవర్నర్‌కు వైసీపీ నేతలు రాసిన లేఖ పూర్తి వివరాలు ఇవే" ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రాజ్యాంగ విరుద్ధమైన, చట్టవిరుద్ధమైన చర్యలు, ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం అహంకార వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. నాయకత్వ ఆలోచనను ఈ చర్యల ద్వారా చూడవచ్చు. పాలకులకు రాజ్యాంగ బాధ్యతలపై గౌరవం లేదు. భారత రాజ్యాంగం ప్రాథమిక సూత్రాల ఆధారంగా న్యాయమైన పాలన అందించాలన్న ఆలోచన లేదు. దేశంలోని న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థాయికి చెందిన వ్యక్తిగా, రాజ్యాంగ నిబంధనల గురించి మీకు బాగా తెలుసు. సమానత్వం, స్వేచ్ఛ, వ్యక్తిగత భద్రత హక్కులు ప్రతి పౌరుడికి సమానంగా ఇచ్చారు.
ముఖ్యమంత్రి సూచనలతో రాష్ట్ర యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇలా చట్టాన్ని ఉల్లంఘించడం బాధాకరం. పక్షపాతం, అసహనంతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది.
సార్, మేము ఇలాంటి ఘటనలు చాలా చూశాం. అనుభవిస్తున్నాము. ప్రభుత్వం చేస్తున్న దుశ్చరలకు, జవాబుదారీతనం లేకపోవడానికి ఉదారహణగా రెండు ఘటలను మీ దృష్టికి తీసుకురానున్నాం.
మొదటిది, ఇటీవల గంగాధర నెల్లూరులో తన పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు అన్ని మీడియాల్లో వచ్చాయి. "YSRCP కార్యకర్తలకు మీరు ఒక చిన్న సహాయం చేసినా, నేను ఊరుకోను. అది అధికారులైనా లేదా ప్రజాప్రతినిధులైనా పర్వాలేదు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా YSRCP శ్రేణులకు ఎవరూ సహాయం చేయకూడదు. వారికి సహాయం చేయడం పాముకి పాలు పోసినట్టే."
ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇది చట్టాన్ని పూర్తి అగౌరవ పరిచినట్టే. ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్షాల పట్ల అసహనం, ద్వేషంతో ఈ స్థాయికి దిగజారగలడా అని నమ్మశక్యం కావడం లేదు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాము. ప్రజాస్వామ్యం ప్రాథమిక సూత్రాలను ముఖ్యమంత్రి పట్టించుకోనట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షం అంటే సిద్ధాంత వైవిధ్యం ఉంటుందే తప్ప వ్యక్తిగత శత్రువుగా చూడకూడదు.
రెండోది, YSRCP సభ్యులను ఎటువంటి కారణం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారనే విషయం రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. వైసీపీ లీడర్లు, శ్రేణులు, జర్నలిస్టులు లేదా YSRCP మద్దుతుదారులపై ప్రతిరోజూ కేసులు నమోదు చేస్తున్నారు. చట్టాన్ని అమలు చేసే అధికారులు ఎటువంటి ఆధారాలు లేకుండా కేసులు నమోదు చేస్తున్నారు. చట్టాన్ని ఉల్లంగించి చేసిన చర్యలు సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ తప్పులను న్యాయస్థానం ఎత్తి చూపుతున్నా సరిదిద్దుకోవడం లేదు. ప్రభుత్వంలోని ఏ నాయకుడు. అధికారి వినడానికి, అర్థం చేసుకోవడానికి, చట్టానికి అనుగుణంగా నడుచుకోవడానికి సిద్ధంగా లేదు. ఏకపక్షంగా కేసులు పెట్టడం దాడులు చేయడం సర్వసాధారణంగా మారాయి.
సర్, రాష్ట్రంలో సాగుతున్న పక్షపాత, రాజ్యాంగ, చట్టవిరుద్ధమైన పాలన గమనించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. భారత రాజ్యాంగ స్ఫూర్తితో సాగే పాలన రాష్ట్రంలో పునరుద్ధరించాలని వేడుకుంటున్నాం. అందుకు తగిన రీతిలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నాము." అని గవర్నర్‌కు లేఖలో వివరించారు. దీనిపై ప్రధానంగా మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణం సంతకం ఉంది. అనంతరం కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సంతకాలు చేశారు.





















