YSR Nethanna Nestham: గుడ్‌న్యూస్! వీళ్ల అకౌంట్స్‌లోకి 24 వేలు, బటన్ నొక్కనున్న సీఎం జగన్ - ఎప్పుడంటే
వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లోకి బటన్ నొక్కి నేరుగా నిధులను జమ చేయనున్నారు.
ఏపీలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద నిధులు అతి త్వరలో విడుదల చేయనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 23న వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లోకి బటన్ నొక్కి నేరుగా నిధులను జమ చేయనున్నారు. క్రిష్ణా జిల్లా మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ లోని పెడన మండలం తోటముూల గ్రామం ఇందుకు వేదిక కానుంది. ఆ సందర్భంగానే ముఖ్యమంత్రి జగన్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మచిలీపట్నం నుంచి పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా కృష్ణా జిల్లా ఏర్పాటైన తరువాత సీఎం అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి.
ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జోగి రమేష్ సొంత అసెంబ్లీ నియోజకవర్గం కూడా అదే కావడంతో వైఎస్ జగన్ పర్యటన, బహిరంగ సభ నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆయనతో పాటు తలసీల రఘురామ్, మాజీ మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ రంజిత్, ఎస్పీ జోషువా బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించారు.
అధికారుల అంచనా మేరకు ఈ బహిరంగ సభకు దాదాపు 50 వేల మంది వరకూ హాజరవుతారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్క పెడనలోనే వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద లబ్దిదారులు 3,161 వేల మంది ఉన్నారు. వారందరినీ ఈ బహిరంగ సభకు పిలవాలని నిర్ణయించారు. అందులో నుంచి 20 మంది నేతన్నలను ఎంపిక చేసి సీఎం జగన్ తో ఫోటో దిగేందుకు ప్రణాళిక చేయనున్నారు. ఈ ప్రాంతం కళంకారీ కళకు ప్రసిద్ధి అయినందున ప్రత్యేకంగా రూపొందించిన కళంకారీ ఫ్రేమును ముఖ్యమంత్రినిక బహూకరించనున్నట్లుగా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు.
ఇంకా ఖరారు కాని షెడ్యూల్
వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వైఎస్ జగన్ హెలికాప్టర్‌లో పెడనకు బయలుదేరి వెళ్తారు. 11:15 నిమిషాలకు బహిరంగ సభలో పాల్గొంటారు. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం తొలుత జెడ్పీ హై స్కూల్ ప్రాంగణాన్ని ఎంపిక చేసినప్పటికీ అక్కడికి దగ్గర్లోనే రైల్వే గేట్ ఉండడం, రైళ్ల రాకపోకలతో గేట్లు పడడం లాంటి ఇబ్బందులు ఉండటం వల్ల ఆ స్థలాన్ని రద్దు చేశారు. దీంతో మరో ప్రాంతాన్ని ఎంపిక చేశారు.
పథకం లక్ష్యం ఇదీ
చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు, వారికి ఆర్థిక సాయం అందించడం ఈ పథకం లక్ష్యం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద ప్రతి సంవత్సరం సొంత మగ్గాలు ఉన్న నేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రూ.24 వేలు నేరుగా సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేస్తారు. అలా ఐదేళ్ల కాలంలో ప్రతి లబ్ధిదారుడికి రూ.1.2 లక్షలు అందుతుంది.
పథకం అర్హత
ఈ పథకం కింద, దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా ఉండాలి. దరఖాస్తుదారుడు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, అతను లేదా ఆమె తప్పనిసరిగా వృత్తి పరంగా నేత అయి ఉండాలి. ఈ పథకం కింద, దరఖాస్తుదారు చేనేత సంఘంలో నమోదు చేసుకోవాలి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి. మగ్గాలు ఎన్ని ఉన్నా ఒక కుటుంబంలో ఒకరికే ప్రయోజనం అందుతుంది.
ఎలా దరఖాస్తు చేయాలి? కావాల్సిన పత్రాలు
* సచివాలయాలు సిద్ధం చేసిన లిస్టును వెరిఫై చేసి లబ్ధిదారులను గుర్తిస్తారు. వాలంటీర్లు, సిబ్బంది బయోమెట్రిక్ తీసుకుని ఎంట్రీ చేస్తారు. ఆ విధంగా ఎంట్రీ చేసిన లిస్టు MPDO లేదా MC లు మరోసారి ధ్రువీకరించి చేనేత శాఖ ద్వారా ఫైనల్ లిస్టును ప్రకటిస్తారు.
* పత్రాలు అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ కార్డ్ వంటివి, రాష్ట్ర చేనేత సంఘం జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తెల్ల రేషన్ కార్డు/దారిద్య్ర రేఖ (BPL) సర్టిఫికెట్ బ్యాంక్ ఖాతా వివరాలు కావాలి.
* వీటితో రాష్ట్ర/జిల్లా స్థాయిలో అమలు చేసే ఏజెన్సీని సంప్రదించాలి.
* గ్రామ సచివాలయాలు సిద్ధం చేసిన నేతన్న నేస్తం లబ్ధిదారుల లిస్టు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. సచివాలయాలలో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో లిస్టును పెడతారు.