YS Sharmila: తిరుపతిలో ప్రత్యేక హోదా డిక్లరేషన్, మోదీ హామీ ఇచ్చిన చోటినుంచే పోరాటం - వైఎస్ షర్మిల
AP Congress News: రాజశేఖరరెడ్డి ఒక చేత్తో సంక్షేమం, ఒక చేత్తో అభివృద్ధి అందించారు కనుకనే అందరి గుండెల్లో నిలిచారని గుర్తు చేశారు.
YS Sharmila Comments: అనంతపురం సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఒక అద్భుత పథకం ప్రకటించారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. అది రూ.5 వేల రూపాయలు అర్హులైన మహిళలకు అందే పథకమని చెప్పారు. ఆ ఇంటి మహిళ అకౌంట్ లోనే డబ్బు క్రెడిట్ అవుతుందని అన్నారు. ఇందిరమ్మ అభయం అనే ఈ పథకం ద్వారా డబ్బు ఇంటిని బాగా చూసుకునే మహిళలకే దక్కుతాయని చెప్పారు. అందుకే ఆ సొమ్మును వారి చేతుల్లోనే పెడుతున్నాం. రాజశేఖరరెడ్డి ఒక చేత్తో సంక్షేమం, ఒక చేత్తో అభివృద్ధి అందించారు కనుకనే అందరి గుండెల్లో నిలిచారని గుర్తు చేశారు. ఏపీ కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్ షర్మిల విలేకరుల సమావేశం నిర్వహించారు.
‘‘ప్రత్యేక హోదా డిక్లరేషన్ 1న జరిగే తిరుపతి సభలో ప్రకటించనున్నాం. ప్రత్యేక హోదా అంశాన్ని అందరూ అధికారం కోసమే వాడుకున్నారు. మోదీ పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన అదే తిరుపతి లోని అదే మైదానంలో మేం డిక్లరేషన్ ఇస్తున్నాం. ప్రత్యేక హోదా తెచ్చుకోవడంలో విఫలం అయ్యారు కాబట్టి రాష్ట్రానికి ఏమీ రాలేదు. ఆంధ్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా.. గత ఎన్నికల్లో 1.18 శాతం ఓటు షేరు ఉన్నా.. ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది కనుకనే నేను చేరాను. ఆ మూడు పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ప్రత్యేక హోదా రాదు. ప్రత్యేక హోదా, పోలవరం, కడప స్టీలు, విశాఖ ఉక్కు, రాజధాని కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి.
ఏపీకి బీజేపీ ఒక్క మేలు కూడా చేయలేదు. రాష్ట్రంలో పాలకపక్షం, ప్రతిపక్షం మోదీకి ఊడిగం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను మోదీకి బానిసలను చేస్తున్నారు. ఉత్తరాఖండ్ లో ప్రత్యేక హోదా కారణంగా 2000 పరిశ్రమలు వచ్చాయి. 972 కిలోమీట్ల సముద్ర తీరం ఉన్న మన రాష్ట్రంలో పది పరిశ్రమలు కూడా రాలేదు. ఇలాగే కొనసాగితే యువతే లేని రాష్ట్రంగా మన రాష్ట్రం తయారవుతుంది. ఏపీపీఎస్సీ ద్వారా మూడు వేలు కూడా లేవు. ఏపీలో ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం అన్నారు.. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు’’ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.