తెలుగు ప్రజల గుండెల్లో తిరుగులేని నేత వైఎస్ఆర్- వర్ధంతి రోజున స్మరించుకుంటున్న నాయకులు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి...ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహానాయకుడు. నిసత్తువలో ఉన్న కాంగ్రెస్ పార్టీని...పాదయాత్ర చేసి అధికారంలోకి తెచ్చిన నాయకుడు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి...ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహానాయకుడు. నిసత్తువలో ఉన్న కాంగ్రెస్ పార్టీని...పాదయాత్ర చేసి అధికారంలోకి తెచ్చిన నాయకుడు. సంక్షేమంతోపాటు డెవలప్ మెంట్ ను పరుగులు పెట్టించిన జననేత. ఎన్నో సంక్షేమ పథకాలకు ఆద్యుడు. సింపుల్ గా చెప్పాలంటే...అసలు సిసలైన లీడర్. 13 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. వైఎస్సార్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో...నల్లమల అడవుల్లో ప్రాణాలు కోల్పోయారు.
మండుటెండలో 1,475 కి.మీల ప్రజా ప్రస్థానం పాదయాత్రతో...కాంగ్రెస్ పార్టీ జీవం పోశారు. వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌కు ప్రాణం పోశారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను అర్థం చేసుకుని... నేనున్నానంటూ భరోసా ఇచ్చిన వైఎస్సార్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పేదల కోసమే పని చేశారు. ఆయన ప్రజలకు దూరమై 13 ఏళ్లు పూర్తవుతున్నా జనం గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ల మూడు నెలల కొద్ది కాలంలోనే...మరచిపోలేని సంక్షేమ పథకాలను అమలు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పేదలకు పక్కా ఇళ్లు వంటి పథకాలతో సమగ్రాభివృద్ధి పెద్దపీట వేశారు.
2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి...వ్యవసాయ రంగానికి పెద్ద వేశారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే... రైతులకు ఉచిత కరెంట్ ఫైల్ మీదే సంతకం చేసి...ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మాట తప్పని నేతగా జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. 1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. 2009 ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తుల్లేకుండా...ఒంటరిగా పోటీ చేసి...కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేలా 108 వాహనాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరిస్తూ 104 సర్వీసులను ప్రారంభించారు.
సెప్టెంబర్ 2 ఉదయం 8.35 గంటలకు రచ్చబండ కార్యక్రమానికి బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి చిత్తూరు జిల్లాకు బయలుదేరారు. 9.27 గంటల సమయంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉండగా వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలీక్యాప్టర్‌కి బేగంపేట్ విమానాశ్రయం, శంషాబాద్ విమానాశ్రయాల నుంచి సంబంధాలు తెగిపోయాయి. రేడియో సిగ్నల్స్ కట్ అయ్యాయ్. నాలుగు మిలిటరీ హెలీక్యాప్టర్లు నల్లమల అటవీ ప్రాంతాన్ని అణువణువూ జల్లెడపట్టి నిరాశతో వెనుదిరిగాయి. వైఎస్ఆర్ చాపర్ ఆచూకీ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సుఖోయ్ యుద్ధ విమానాన్ని రంగంలోకి దింపింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ఓ వ్యక్తి ఆచూకీ కోసం యుద్ధ విమానాన్ని ఉపయోగించడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. అతి పెద్ద సెర్చ్ ఆపరేషన్‌గా దేశ చరిత్రలో నిలిచిపోయింది.
వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో 1949, జులై 8న జయమ్మ, రాజా రెడ్డి దంపతులకు వైఎస్ఆర్ జన్మించారు. 1978లో రాజకీయాల్లోకి ప్రవేశించి...పులివెందుల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రివర్గంలోనూ చోటు దక్కించుకున్నారు. రూరల్ డెవలప్ మెంట్ మినిస్టర్ బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగు పర్యాయాలు పార్లమెంట్ కు, ఐదు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎంతో మంది యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. వారికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చి...గెలిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.