లెక్కలు చెబుతా వస్తారా- చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్
ప్రతిపక్ష నేత చంద్రబాబు గుంటూరు జిల్లాలోని పెద్ద కూరపాడు నియోజకవర్గంలో పర్యటించారు. రోడ్ షోతోపాటు బహిరంగ సభ నిర్వహించారు. అక్కడ స్దానిక శాసన సభ్యుడి పని తీరుపై విమర్శలు చేశారు.
లెక్కలు చెబుతా రండి అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దకూరపాడు శాసన సభ్యుడు నంబూరి శంకరరావు పిలపునిచ్చారు. ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉన్న స్థానిక అధికార పార్టీకి చెందిన శాసన సభ్యుడిపై బురదచల్లటం చంద్రబాబుకు కామన్ అయిపోయిందని ఆయన అన్నారు.
ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు గుంటూరు జిల్లాలోని పెద్ద కూరపాడు నియోజకవర్గంలో పర్యటించారు. రోడ్ షోతోపాటు బహిరంగ సభ నిర్వహించారు. అక్కడ ఉన్న స్దానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యుడి పని తీరుపై చంద్రబాబు విమర్శలు చేశారు. దీనికి కౌంటర్‌గా వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోటాపోటీగా ఫ్లెక్సీల ఏర్పాటు వాటిని పోలీసులు తొలగించడంతో నియోజకవర్గం హాట్ హాట్‌గా మారింది.
ఎమ్మెల్యే కౌంటర్...
చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్పందించారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పెదకూరపాడులో చేసిన అభివృద్ధిపై లెక్కలు చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. దీనికి సిద్ధపడి చంద్రబాబు వస్తారా అని సవాల్ చేశారు.
గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలిచ్చారో కూడా చంద్రబాబు చెప్పాలన్నారు నంబూరి. అవినీతి రారాజు చంద్రబాబు తన పై ఆరోపణలు చేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందిని వ్యాఖ్యానించారు. అవినీతి చేసి ఓటమి పాలైన వాళ్లు తనపై ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే స్పందించారు. 2014 నుంచి 2019 వరకు పెదకూరపాడులో 1100 కోట్లతో అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాలుగేళ్లలో 1377 కోట్లతో సంక్షేమ పథకాలు, 655 కోట్లతో అభివృద్ధి పనులు చేశానని.. వాటి లెక్కలు చెప్పేందుక తాను సిద్ధమని అన్నారు. టీడీపీ అభివృద్ధి చేశామంటున్న రూ.1100 కోట్ల అభివృద్ధి వివరాలు చెప్పగలరా అని ప్రశ్నించారు.
టీడీపీ హయాంలో ఇసుక తవ్వకాల వల్ల 28 మంది చనిపోతే.. చంద్రబాబు ఆ పాపం తనకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ రూ.100 కోట్లు ఫైన్ వేసిందని, టీడీపీ హయాంలోనే అన్న విషయం చంద్రబాబు మర్చిపోయారన్నారు. ఇటీవల అమరావతి మండలంలో ఇద్దరు చనిపోవడానికి కారణం.. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి చేసిన ఇసుక తవ్వకాల వల్లేనని చెప్పారు.
రోడ్లు వేస్తామని చెప్పి....
పెదకూరపాడు నియోజవకర్గంలో అమరావతి - బెల్లంకొండ డబుల్ లేన్ రోడ్డు వేస్తున్నామని.. అమరావతి - తుళ్లూరు రోడ్డు కూడా తమ ప్రభుత్వ హయాంలోనే వేస్తున్నామని చెప్పారు. ఇవన్నీ గతంలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పెదమద్దూరు బ్రిడ్జి నిర్మాణ పనులు కనిపించలేదా అని ప్రశ్నించారు. కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు తెచ్చి.. త్వరలో నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. అభివృద్ధి చేయలేదంటున్న చంద్రబాబు.. అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు వయసుతో పాటు చాదస్తం పెరిగిందని శాసన సభ్యుడు నంబూరి శంకరరావు అన్నారు.
తన పేరును కూడా అవమాన పరిచేవిధంగా మాట్లాడారని మండిపడ్డారు శంకరరావు. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేసే స్థాయికి చంద్రబాబు దిగజారారని మండిపడ్డారు. చినపిచ్చయ్య అందించిన అబద్ధపు వివరాలతో పెదపిచ్చయ్య తనపై అసత్య ఆరోపణలు చేశారన్నారని, చంద్రబాబు అమరావతి పర్యటన పెద్ద ఫెయిల్ అని జనం రాకపోవడంతో ప్రస్టేషన్‌లో విజ్ఞత మర్చిపోయి మాట్లాడారన్నారని ధ్వజమెత్తారు.