Anitha On Amarnath: మంత్రి నిసిగ్గుగా చెప్పారు, ఇవే మాటలు అక్కడ చెప్పగలరా? - వంగలపూడి అనిత ఛాలెంజ్
వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోను తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తగల బెట్టారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ లిక్కర్ పైన వచ్చే ఆదాయం మీద ఆధారపడలేదని అన్నారు.
Vangalapudi Anitha On Minister Gudiwada Amarnath: మద్య నిషేధం హామీ వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోలోనే లేదంటూ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ మాటలతో విపక్ష పార్టీల నేతలు మరింత ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలపై స్పందించారు. వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం లేదని మంత్రి అమర్నాథ్ నిసిగ్గుగా చెప్తున్నారని మండిపడ్డారు. అనకాపల్లిలో ప్రజా సభలో ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్పగలరా అంటూ వంగలపూడి అనిత సవాలు విసిరారు. వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న విషయాలు అన్ని అబద్ధాలని, అది ఒక చెత్త కాగితమని కొట్టి పారేశారు.
అందుకే వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోను తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తగల బెట్టారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ లిక్కర్ పైన వచ్చే ఆదాయం మీద ఆధారపడలేదని అన్నారు. ఆ ఆదాయంతో సంక్షేమ పథకాలు కూడా కొనసాగించలేదని అన్నారు. అప్పటికీ ఇప్పటికీ మద్యం ఆదాయం మూడు ఇంతలు పెరిగిందని వివరించారు. లక్ష్యాలు పెట్టి మరీ, మద్యం అమ్మకాలు జరుపుతున్నారని విమర్శించారు.
‘‘మా మ్యానిఫెస్టోలో మద్యనిషేధం లేదు అని మంత్రి అమర్ నాథ్ చెప్పడం అతని దిగజారుడుతనానికి నిదర్శనం. ఇది తనకు ఓట్లు వేసిన మహిళలను మోసగించడమే. ఓట్ల అవసరం తీరింది కనుక ఏదైనా మాట్లాడొచ్చు అన్నట్లుంది మంత్రి ప్రవర్తన. ఇది జగన్ రెడ్డి నా కాదా? ఇది తమ పార్టీ మ్యానిఫెస్టో నా కాదా? చెప్పాలి.’’ అని వంగలపూడి అనిత ట్వీట్ చేశారు.
మా మ్యానిఫెస్టోలో మద్యనిషేధం లేదు అని మంత్రి అమర్నాథ్ చెప్పడం అతని దిగజారుడుతనానికి నిదర్శనం. ఇది తనకు ఓట్లు వేసిన మహిళలను మోసగించడమే. ఓట్ల అవసరం తీరింది కనుక ఏదైనా మాట్లాడొచ్చు అన్నట్లున్న మంత్రి ప్రవర్తన. ఇది 👇జగన్ రెడ్డి నా కాదా? ఇది తమ పార్టీ మ్యానిఫెస్టో నా కాదా? చెప్పాలి. pic.twitter.com/TBWHmVVXmD
— Anitha Vangalapudi (@Anitha_TDP) July 30, 2022
మంత్రి అమర్ నాథ్ వ్యాఖ్యలు ఇవీ..
ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధం అంశం రాజకీయంగా వివాదాస్పదం అవుతున్న దశలో ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యపాన నిషేధం అన్న మాటే తమ మేనిఫెస్టోలో లేదన్నారు. తాము మద్యనిషేధం చేస్తామని ఎప్పుడు.. ఎక్కడ చెప్పామని ఆయన ప్రశ్నించారు. ఎక్కడైనా అని ఉంటే చూపించాలని సవాల్ చేశారు. మద్యనిషేధం చేస్తామని చెప్పలేదని.. ధరను స్టార్ హోటళ్లలో మాదిరి షాక్ కొట్టేలా పెంచుతామని మాత్రమే చెప్పామన్నారు. అలాగే చేశామని అంటున్నారు. అందుకే తాగేవాళ్లు తగ్గారు.. ఆదాయం పెరిగిందని చెబుతున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేసి ఓట్లడుగుతామని జగన్ సవాల్
తాము అధికారంలోకి వస్తే మద్య నిషేధం విధిస్తామని సీఎం జగన్ అనేక సార్లు చెప్పారు. ప్రతిపక్షంలోనే ఉండగానే కాదు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పారు. మద్యనిషేధం చేసిన తర్వాతే ఓట్లడుగుతామని కూడా పలు మార్లు సవాళ్లు చేశారు. ఏడాదికి ఇరవై శాతానికి చొప్పున తగ్గిస్తామని చెప్పి తొలి రెండేళ్లు కొంత మేర తగ్గించారు. ఎన్నికల నాటికి మద్యాన్ని పూర్తిగా నిషేధించి ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పారు. అయితే ఏపీలో ఫైవ్ స్టార్ హోటళ్లు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినన్ని మాత్రమే ఉన్నాయి. కొన్ని ప్రధాన నగరాలకే పరిమితమయ్యాయి. వాటికే మద్యాన్ని పరిమితం చేస్తే మద్య నిషేధం దాదాపు అమలు చేసినట్లే.