Breaking News: విజయవాడలో గోల్డ్ మాఫియా గుట్టురట్టు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
కన్న కూతురితో పాటు కుమార్తె వరసయ్యే మరో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దిశ డీఎస్పీ మురళీమోహన్ తెలిపిన వివరాలు ప్రకారం తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని ఓ గ్రామంలో వరసకు కుమార్తె అయిన 14 ఏళ్ల బాలికపై ఆగస్టు 15న ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆ బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులకు విషయం తెలిసింది. వారు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. దర్యాప్తులో ఆగస్టు 21న తన ఆరేళ్ల సొంత కూతురిపైనా అఘాయిత్యం చేసినట్లు ఒప్పుకున్నాడు.
బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచారం..
స్పా సెంటర్, బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తోన్న ఇంటిపై పోలీసులు దాడి చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు సహా ఇద్దరు మేనేజర్లు, 10 మంది విటులు, పది మంది యువతులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.73000 నగదు, ఓ కారు, 28 మొబైల్ ఫోన్లు, రూ.4 లక్షలు బ్యాలెన్స్ ఉన్న బ్యాంకు ఖాతాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
విజయవాడలో గోల్డ్ మాఫియా గుట్టురట్టు..
విజయవాడలో గోల్డ్ మాఫియా గుట్టురట్టయింది. సౌదీ నుంచి సింగపూర్ మీదుగా నగరానికి అక్రమంగా బంగారం తెస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతోన్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యులు రూ.5 లక్షలు విలువ గల బంగారం బిస్కెట్లను కస్టమర్లకు రూ.4 లక్షలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నగదు చెల్లించిన 30 రోజుల్లో బంగారం డెలివరీ చేస్తామని కస్టమర్లకు మాయమాటలు చెబుతున్నారని పోలీసులు తెలిపారు. 2018 నుంచి ఈ దందా కొనసాగుతోందని వెల్లడించారు.
ఇటీవల బాధితుల నుంచి దాదాపు రూ.6 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. గత 4 నెలల నుంచి బంగారం డెలివరీకి బ్రేక్ పడడంతో వివాదం తెరపైకి వచ్చింది. ముందస్తు ఆర్డర్లు ఇచ్చిన కొందరు గొడవకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది.
రైల్వే ఉద్యోగి పాత్ర కీలకం..
బంగారం స్మగ్లింగ్‌లో రైల్వే ఉద్యోగితో పాటు ఓ మహిళ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. బంగారం బిస్కెట్ల కోసం రైల్వే, దుర్గ గుడి ఉద్యోగులు డబ్బులు చెల్లించినట్లు సమాచారం. బంగారం కోసం ఇచ్చిన నగదు బ్లాక్ మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రాలేదని తెలుస్తోంది.
భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య.. ఏపీలో ఘోరం..
కుటుంబ కలహాలతో భర్తను అతి కిరాతకంగా హత్య చేసిందో భార్య. ఈ దారుణ ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో చోటుచేసుకుంది. తాళ్లరేవు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన విశ్వనాధపల్లి అప్పారావుని అతని భార్య విశ్వనాధపల్లి దేవి గొడ్డలితో నరికి చంపింది. హత్య చేసిన అనంతరం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయింది. అనుమానంతో తనను రోజూ వేధిస్తున్నాడని, విసుగు చెంది చంపేసినట్లు దేవి.. పోలీసులకు వెల్లడించింది. ఘటనా స్థలాన్ని డీఎస్ పీ భీమారావు, సీఐ ఆకుల మురళీ కృష్ణ పరిశీలించారు.
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
అనంతపురం జిల్లా రొద్దం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను రామకృష్ణ (38), కుళ్లాయప్ప (41)గా గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రొద్దం గ్రామానికి చెందిన ముగ్గురు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న బైక్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించే ప్రయత్నం చేశారు. మార్గ మద్యంలోనే కుళ్లాయప్ప, రామకృష్ణ మృతి చెందారు. లక్ష్మన్న అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు ముగ్గురు ఉదయం కర్ణాటకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
అక్రమ వసూళ్లకు పాల్పడుతోన్న ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు..
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై నెల్లూరు ఎస్పీ వేటు వేశారు. నెల్లూరులోని పప్పుల వీధిలో వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. నవాబుపేట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్ ఇటీవల వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకుంటుండగా కొందరు వీడియో తీసి వాట్సాప్‌లో పోస్టు చేశారు. అది కాస్త వైరల్ అయింది. దీనిపై విచారణ చేపట్టిన ఎస్పీ వారిద్దరిపై వేటు వేస్తూ (వీఆర్) ఉత్తర్వులు జారీ చేశారు.