ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్
తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని ఏపీ సీఐడీ అధికారులకు లేఖ రాశారు చింతకాయల విజయ్.
విచారణకు రమ్మని చెప్పిన ఏపీ సీఐడీ అధికారులకు టీడీపీ లీడర్ చింతకాయల విజయ్ లేఖ రాశారు. ఆ లేఖను ఆయన తరఫున న్యాయవాదులు సీఐడీ కార్యాలయంలోని బాక్స్‌లో వేసి వెళ్లారు.
తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీ, కేసుల వివరాలు ఇవ్వాలని సీఐడీ అధికారులను విజయ్ కోరారు. తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన అధికారులు అందర్నీ భయభ్రాంతులకు గురి చేశారన్నారు. తన కుమార్తెను బెదిరించారని.. డ్రైవర్‌ను కొట్టారని ఆరోపించారు. తన ఇంట్లో పని చేసేవారి పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారని విమర్శించారు.
ఇదే విషయాన్ని లెటర్‌లో పేర్కొన్నారు విజయ్. ఆ లేఖను ఇచ్చేందుకు విజయ్ తరఫున న్యాయవాదులు ఏపీ సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. కానీ ఎక్కడ లెటర్ తీసుకోవడానికి ఏ అధికారి కూడా ఆసక్తి చూపలేదని ఆరోపించారు న్యాయవాదులు. అసలు 41ఏ కింద నోటీసులు విజయ్‌కు గానీ ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇవ్వాలని ఇంట్లో పని చేస్తున్న వాళ్లకు ఇచ్చి వెళ్తే చెల్లబోదంటున్నారు న్యాయవాదులు.
సీఐడీ పేరుతో వచ్చిన నోటీసులో ఎలాంటి వివరాలు లేవని.. అసలు ఏ కేసుల్లో నోటీసులు ఇచ్చారో కూడా చెప్పలేదన్నారు విజయ్ తరఫున న్యాయవాదులు. కేవలం విజయ్‌ను ఆయన ఫ్యామిలీని భయపెట్టేందుకే ఈ నోటీసులు ఇచ్చినట్టు వాళ్లు అనుమానం వ్యక్తం చేశారు.
అక్టోబర్ 1న తెలుగుదేశం పార్టీ యువత నేత, ఐటీడీపీ సోషల్ మీడియా విభాగానికి ఇంచార్జ్ గా ఉన్న అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఇంటికి ఏపీసీఐడీ పోలీసులు రావడం రాజకీయ దుమారానికి కారణంగా అయింది. హైదరాబాద్‌లోని ఓ అపార్టుమెంట్‌లో విజయ్ కుటుంబం నివసిస్తోంది. ఏపీసీఐడీ అధికారుల బృందం ఉదయం వారింటికి వెళ్లింది. ఆ సమయంలో చింతకాయల విజయ్ ఇంట్లో లేరు. పనిమనిషులతో పాటు చిన్న పిల్లలు ఉన్నారు. అయితే వారినే సీఐడీ అధికారులు ప్రశ్నించారని.. ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారని ఆరోపణలు వచ్చాయి. చింతకాయల విజయ్ పిల్లలను ప్రశ్నించి వారి ఫోటోలు తీసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. చుట్టుపక్కల ఫ్లాట్ల వారు కూడా వచ్చి సీఐడీ అధికారులను ప్రశ్నించడంతో వారు వెళ్లిపోయారు.
బెదిరింపులకు లొంగేది లేదన్న అయ్యన్నపాత్రుడు
ఈ అంశంపై అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఎందుకు వచ్చారో.. ఏ కేసు విషయంలో వచ్చారో కూడా స్పష్టత లేకపోవడంతో టీడీపీ నేతలు మండిపడ్డారు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు దొంగల్లా వ్యవహరిస్తున్నారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా వస్తారని ప్రశ్నించారు. బెదిరిస్తే వెనక్కి తగ్గే వాళ్లం కాదని పార్టీ కోసం ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు. సీఐడీ పోలీసులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని.. పిల్లలను ప్రశ్నించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దోపిడీని ప్రశ్నిస్తే సీఐడీ పేరుతో బెదిరిస్తారా అని అయ్యన్న ప్రశ్నించారు. సీఎం ఇంట్లో మహిళలు, చిన్నపిల్లలు ఉండరా అన్నారు.
సీఐడీ తీరును ఖండించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఈ అంశంపై స్పందించారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి తనయుడు, టిడిపి యువనేత చింతకాయల విజయ్ ఇంట్లోకి దోపీడీ దొంగల్లా పోలీసులు చొరబడటాన్ని తీవ్రంగా ఖండింస్తున్నట్టు తెలిపారు. విజయ్ ఇంట్లో చిన్న పిల్లలను, పని వాళ్లను భయభ్రాంతులను చేసేలా సిఐడి పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు.