గత ప్రభుత్వ నిర్ణయాలపై వేసిన సిట్‌ను సమర్ధించిన సుప్రీం- హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేత
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చాలా పనుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వం గతేడాది సిట్ ఏర్పాటు చేసింది.
గత ప్రభుత్వం హయాంలో జరిగిన పనులపై ప్రస్తుతం జగన్ ప్రభుత్వం వేసిన సిట్ వేయడంపై సుప్రీం కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ తీర్పు వెల్లడించింది. హైకోర్టు తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చాలా పనుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వం గతేడాది సిట్ ఏర్పాటు చేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణంసహా భారీ ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది.
ఈ సిట్ ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీన్ని విచారించిన జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజాధనం దుర్వినియోగం, వృథా, దురుద్దేశం వంటి అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దని అంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా అని ప్రశ్నించింది. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం కరెక్టు కాదని చెప్పింది సుప్రీంకోర్టు.