SC on Amaravati cases: అమరావతి కేసులను 28నే విచారిస్తామన్న సుప్రీంకోర్టు- ముందే విచారించాలన్న ఏపీ అభ్యర్థన కొట్టివేత
SC on Amaravati cases: అమరావతి కేసులను 28వ తేదీ లోపే విచారించాలన్న ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. చాలా కీలకమైన అంశాలు ఇమిడి ఉన్నందున 28నే విచారిస్తామంది.
SC on Amaravati cases: అమరావతి కేసులను త్వరగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 28వ తేదీనే విచారిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ ధర్మాసనం తేల్చి చెప్పింది. 28వ తేదీకన్నా ముందే కేసు విచారణ జరపాలన్న ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదుల విజ్ణప్తిని తోసిపుచ్చింది ధర్మాసనం.
రాజ్యాంగ పరమైన అంశాలు అమరావతి కేసులో చాలా ఇమిడి ఉన్నాయని న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ పేర్కొన్నారు. 28వ తేదీ ఒక్క రోజే విచారణ సరిపోదని... బుధ, గురువారాల్లో అంటే 29,30న కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. బుధ, గురువారాల్లో నోటీసులు ఇచ్చిన కేసుల్లో విచారణ జరపరాదని సిజెఐ సర్క్కులర్ ఉందని గుర్తు చేసింది ధర్మాసనం. అయితే సిజెఐ ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదు కోరారు. దీన్ని కూడా తోసిపుచ్చింది.
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ దశలో ఉన్నాయి. అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై ఇదివరకే సుప్రీంకోర్టు స్టే విధించింది. మస్తాన్ వలీ అనే వ్యక్తి కూడా ఏపీ రాజధాని అంశంపై మరో పిటిషన్ దాఖలు చేశారు. శివరమకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం రాజధాని ఖరారు చేయాలని అందులో పేర్కొన్నారు. ఈ పిటీషన్ ను కూడా కలిపి విచారణకు స్వీకరించనుంది. ఏపీ రాజధాని నగరాన్ని నిర్ధారించే విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలని, దీన్ని అమలు చేయాలంటూ మస్తాన్ వలీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ పైనా ఒకేసారి విచారణ జరగనుంది.
మూడు రాజధానుల అంశం ఏపీలో రాజకీయంగా కలకలం రేపుతోంది. గత గత ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా అమరావతిని ఖరారు చేసింది. ప్రస్తుత సీఎం జగన్ అప్పట్లో ప్రతిపక్ష నేతగా .. అమరావతిని స్వాగతించారు. ఎన్నికల ప్రచారంలోనూ అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మూడు రాజధానులని ప్రకటించారు. ఇప్పుడు విశాఖ రాజధానిగా చెబుతున్నారు. 29వేల మంది రైతుల భవిష్యత్ తో సుప్రీంకోర్టు తీర్పు ముడి పడి ఉండటంతో... అందరి దృష్టి సుప్రీంకోర్టు వైపు ఉంది.
అధికార పార్టీ మాత్రం న్యాయపరమైన చిక్కులన్నీంటినీ దాటుకొని వీలైనంత త్వరగా విశాఖ వేదికగా పాలన సాగించాలన్న పట్టుదలతో ఉంది. అందుకే ఈ కేసుల ఝంజాటాన్ని వీలైనంత త్వరగా తొలగించుకోవాలని పదే పదే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతోంది. పాలకు ప్రకటనలు కూడా ఆలానే ఉన్నాయి. ఉగాధి నుంచే విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని భావిస్తున్నారు.
న్యాయపరమైన చిక్కులు తొలగించుకొని ఏప్రిల్ తర్వాత విశాఖను రాజధానిగా చేస్తామని ఉత్తరాంధ్ర వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి రెండు రోజుల క్రితమే ప్రకటించారు. శ్రీకాకుళంలో మంగళవారం జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందున్నారు.