ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. డిక్లరేషన్ పత్రం సరిగా లేని ఓట్లను తిరస్కరిస్తారు. సరైన ఓట్లను లెక్కించి ఫలితాల షీట్‌లో నమోదు చేస్తారు.
AP Local Body Elections Counting: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇలా జరుగుతుంది, దశలవారీగా వివరాలు
ఏపీలో 92 పట్టణ స్థానిక సంస్థల ఫలితాలు మంగళవారం తేలనున్నాయి. ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను నాలుగు దశలలో చేస్తారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

- ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, వివరాలు నమోదు చేస్తారు.
- బ్యాలెట్లను వేరు చేసి, 25 చొప్పున కట్టలు కట్టి, డ్రమ్‌లలో కలుపుతారు.
- డ్రమ్‌ల నుండి బ్యాలెట్లను తీసి, ఓట్ల చెల్లుబాటును పరిశీలిస్తారు.
- రౌండ్ల వారీ లెక్కింపు తర్వాత ఫలితాలు, రీకౌంటింగ్ అవకాశం ఉంటుంది.
అమరావతి: ఏపీలో 92 పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం మొదలైంది. అయితే బ్యాలెట్ పత్రాలతో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో 62.16 శాతం పోలింగ్ నమోదైంది. ఇంతకీ ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారో ఇక్కడ వివరాలు అందిస్తున్నాం.
మొదట పోస్టల్ బ్యాలట్ పత్రాల కౌంటింగ్
ఓట్ల లెక్కింపులో భాగంగా మొదట పోస్టల్ బ్యాలట్ పత్రాలు లెక్కిస్తారు. కౌంటింగ్ మొదలుపెట్టిన సమయానికి వచ్చిన కవర్లను ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేస్తారు. ప్రతి కవరు నుంచి డిక్లరేషన్ పత్రం తీసి పరిశీలిస్తారు. అందులో డిక్లరేషన్ పత్రం లేకపోయినా, దానిపై సంతకం/ అధికారి అటెస్టేషన్ లేకపోయినా ఓటును తిరస్కరిస్తారు. డిక్లరేషన్‌లోని బ్యాలట్ నంబర్ కవరుపై ఉన్న నెంబర్‌తో సరిపోలకపోయినా ఓటు లెక్కించరు. వ్యాలిడ్ ఓట్లను వేరే ప్యాకెట్‌లో ఉంచి సీల్ చేస్తారు. తరువాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి అభ్యర్థుల వారీగా రిజల్ట్ షీట్‌లో నమోదు చేస్తారు.
నాలుగు దశలలో పట్టణ స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఫేజ్ 1: బ్యాలెట్ పత్రాల వర్గీకరణ, ప్రత్యేకంగా కట్టలు
మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో తొలిదశలో పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ పెట్టెలను తెరిచి బ్యాలెట్ పత్రాలను బయటకు తీస్తారు. వీటిలో మేయర్, ఛైర్‌పర్సన్‌కు సంబంధించిన గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను, వార్డు సభ్యులకు సంబంధించిన తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను ముందుగా వేరు చేస్తారు. ఆ తర్వాత మేయర్, వార్డు సభ్యుల బ్యాలెట్లను వేర్వేరుగా ప్రతి 25 పత్రాలకు ఒక కట్ట చొప్పున రబ్బర్ బ్యాండ్లు వేస్తారు. ఈ కట్టల లెక్కలను పోలింగ్ కేంద్రాల బ్యాలెట్ పత్రాల లెక్కలతో కంపేర్ చేస్తారు. చివర్లో 25 కంటే తక్కువ బ్యాలెట్ పత్రాలు మిగిలిపోతే వాటిని విడిగా ప్రత్యేక ట్రేలో ఉంచుతారు.
దశ 2: డ్రమ్ లలో వేయడం, కట్టలు మిక్సింగ్
ఈ దశలో 25 బ్యాలెట్ పత్రాలున్న కట్టలను మేయర్/ ఛైర్‌పర్సన్, వార్డు సభ్యుల కోసం ఏర్పాటు చేసిన చిన్న డ్రమ్‌లలో వేస్తారు. మేయర్/ ఛైర్‌పర్సన్ బ్యాలెట్ కట్టలను రిటర్నింగ్ ఆఫీసర్ (RO) టేబుల్ వద్ద ఉన్న పెద్ద డ్రమ్‌లోకి, వార్డు సభ్యుల బ్యాలెట్లను వార్డు కౌంటింగ్ టేబుళ్ల వద్ద ఉన్న డ్రమ్‌లలో వేస్తారు. బ్యాలెట్ పత్రాలు చిరిగిపోకుండా మెత్తని వస్తువు లేదా చెక్కకర్రతో డ్రమ్‌లోని కట్టలను బాగా కలుపుతారు. ఈ ప్రక్రియలో అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లను టేబుళ్ల వద్దకు అనుమతిస్తారు.
దశ 3: ఓట్ల లెక్కింపు, చెల్లుబాటు పరిశీలన
ఈ దశలో ప్రతి డ్రమ్ నుంచి 40 కట్టలను (మొత్తం 1000 బ్యాలెట్ పత్రాలు) తీసి కౌంటింగ్ టేబుల్‌పైకి పంపిస్తారు. కౌంటింగ్ సిబ్బంది వాటిని పరిశీలించి చెల్లని బ్యాలెట్ పత్రాలను పక్కన పెట్టి, ఆపై అభ్యర్థుల వారీగా ఓట్లను వేరు చేస్తుంటారు. డ్రమ్‌లలోని బ్యాలెట్ పత్రాలు పూర్తయ్యే వరకు ఈ లెక్కింపు రౌండ్ల వారీగా జరుగుతుంది. అనంతరం అభ్యర్థుల వారీగా ఓట్లను 50 చొప్పున కట్టలుగా కట్టి భద్రపరుస్తారు. లెక్కింపు పూర్తయ్యాక అభ్యర్థులకు, నోటాకు వచ్చిన మొత్తం ఓట్లను రిజల్ట్ షీట్‌లో నమోదు చేస్తారు.
దశ 4: ఫలితాల ప్రకటన, రీకౌంటింగ్ అవకాశం
చివరి దశలో రౌండ్ల వారీ లెక్కింపు పూర్తయ్యాక పోలైన మొత్తం ఓట్లు, అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను రిటర్నింగ్ అధికారి రిజల్ట్ షీట్‌లో నమోదు చేస్తారు. రీకౌంటింగ్ కావాలనుకునే అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి 15 నిమిషాల టైమ్ ఇస్తారు. అభ్యర్థి కోరికలో సరైన కారణాలున్నాయని రిటర్నింగ్ అధికారి భావిస్తే కనుక రీకౌంటింగ్‌కు ఆదేశిస్తారు. రీకౌంటింగ్‌లో పోస్టల్ బ్యాలెట్లతో సహా అన్నింటినీ మళ్లీ లెక్కించిన తర్వాతే ఫలితాలను ప్రకటిస్తారు.
Frequently Asked Questions
ఓట్ల లెక్కింపు ఎలా మొదలవుతుంది?
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎన్ని దశలలో జరుగుతుంది?
పట్టణ స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నాలుగు దశలలో జరుగుతుంది. అవి: బ్యాలెట్ పత్రాల వర్గీకరణ, డ్రమ్ లలో వేయడం, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.
చెల్లని పోస్టల్ బ్యాలెట్‌గా దేనిని పరిగణిస్తారు?
డిక్లరేషన్ పత్రం లేకపోయినా, సంతకం/అటెస్టేషన్ లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ తిరస్కరించబడుతుంది. అలాగే, బ్యాలెట్ నంబర్ కవరుపై ఉన్న నంబర్‌తో సరిపోలకపోయినా లెక్కించరు.
ఓట్ల రీకౌంటింగ్‌కు అవకాశం ఉందా?
అవును, రౌండ్ల వారీ లెక్కింపు పూర్తయ్యాక అభ్యర్థులు రీకౌంటింగ్ కోరడానికి 15 నిమిషాలు సమయం ఇస్తారు. సరైన కారణాలు ఉంటే రీకౌంటింగ్‌కు ఆదేశించవచ్చు.
ట్రెండింగ్ వార్తలు























