AP News: మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం పెమ్మసాని గారూ - షర్మిల మళ్లీ కౌంటర్
YS Sharmila: ఏపీలో ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తారా లేదా అనే అంశంపై షర్మిల - పెమ్మసాని సోషల్ మీడియాలో పరస్పరం పోస్టులు చేసుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి షర్మిల స్పందించారు.
Sharmila Vs Pemmasani: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఆరోగ్యశ్రీ విషయంలో వీరిద్దరి మధ్య చర్చ నడుస్తోంది. తొలుత పెమ్మసాని ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతూ.. కేంద్ర పథకం అయిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రం వినియోగించుకోవాలని చెప్పడంపై షర్మిల అభ్యంతరం తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏపీలో లేకుండా చేసే ఉద్దేశం ఉందా అని షర్మిల అనుమానం వ్యక్తం చేస్తూ ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పడం ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉందని ఆమె పేర్కొన్నారు.
దీనికి పెమ్మసాని కౌంటర్ ఇచ్చారు. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ పథకం అనేది ఆరోగ్యశ్రీని రీప్లేస్ చేయబోదని క్లారిటీ ఇచ్చారు. షర్మిల వ్యాఖ్యలు ఏపీ ప్రజలను తప్పుదోవపట్టించేలా ఉన్నాయని సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు.
తాజాగా షర్మిల పెమ్మసాని స్పందనపై స్పందించారు. ‘‘వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీపై మీ స్పందనకు ధన్యవాదాలు .. నేను ప్రజలను పక్క దారి పట్టించడానికి మాట్లాడి ఉంటే మిమల్ని సమాధానం చెప్పమని ఎందుకు అడుగుతాను .. మీ పత్రిక సమావేశంతో ప్రజలకు అనుమానాలు తలెత్తాయి. అవి మా దృష్టికి రావడంతో నేను స్పందించి ప్రజలకు స్పష్టత ఇవ్వమని అడగటం జరిగింది. పెమ్మసాని గారు… రాష్ట్రంలో అధికార పార్టీ కి చెందిన నేతగా …
- “ఆరోగ్య శ్రీ కి డబ్బులు లేవు
- ఆసుపత్రులకు బిల్లులు రావడం లేదు
- పేషంట్లకు వైద్యం అందడం లేదు
- అందుకే ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ కార్డులు తీసుకోండి” అని మీరే ఆరోగ్యశ్రీ పథకం కొనసాగింపుపై అనుమానాలు కలిగించడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వాన్ని నడిపే వాళ్లే భాద్యతా రాహిత్యమైన కామెంట్స్ చేయొచ్చా ? మీ విజ్ఞత కే వదిలేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఆరోగ్యశ్రీ ని , అనారోగ్యశ్రీ చేయకుండా పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేస్తూ, పథకాన్ని ఆటంకాలు రాకుండా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఎన్నికల్లో ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయిలు హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని మీ NDA కూటమి ఎన్నికల హామీ ఇచ్చింది. ఇది ఎప్పటిలోగా అమలు చేస్తారో కూడా ప్రజలకు వివరించండి’’ అని షర్మిల ట్వీట్ చేశారు.
YSR ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీపై మీ స్పందనకు ధన్యవాదాలు .. నేను ప్రజలను పక్క దారి పట్టించడానికి మాట్లాడి ఉంటే మిమల్ని సమాధానం చెప్పమని ఎందుకు అడుగుతాను .. మీ పత్రిక సమావేశంతో ప్రజలకు అనుమానాలు తలెత్తాయి.అవి మా దృష్టికి రావడంతో నేను స్పందించి ప్రజలకు స్పష్టత ఇవ్వమని అడగటం… https://t.co/kBa9he0ZbI
— YS Sharmila (@realyssharmila) July 30, 2024