వినాయక చవితిలో రాజకీయాల జోక్యం, ఏం జరగుతుంది?
ఏపీ వినాయక చవితి సంబురాల్లో రాజకీయం జోక్యం చేసుకుంటుంది. ఆంక్షల పెడుతూ ప్రజలను తెగ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితిలో రాజకీయం జోక్యం చేసుకుంది. ఆంక్షల పేరుతో ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను హరిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే... అలాంటిదేమీ లేదని అధికార పార్టీ నేతలు, అధికారులు వివరణ ఇచ్చుకుంటున్నారు. మొత్తానికి విఘ్నాలు తొలగించే టారిఫ్ లో ఎలాంటి మార్పులు లేవు.
దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్న విద్యుత్ శాఖ..
వినాయక చవితి ఉత్సవాల పందిళ్లకు విద్యుత్ ఖర్చులు పెరిగాయాంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు, భక్తులకు, నిర్వాహకులకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థల సీఎండీలు కే సంతోషరావు, జే పద్మాజనార్థనరెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలకు తాత్కాలిక విద్యుత్ టారిఫ్ ను పెంచలేదని, పైగా గతంలో 250 వాట్స్ కి కూడా రూ.1000 తీసుకునేవారని, కానీ ఇప్పుడు రూ.750 గా నిర్ణయించామన్నారు.
అప్పట్నుంచీ అవే చార్జీలు..
రాష్ట్ర వ్యాప్తంగా వినాయక మండపాలకు 2014 నుంచి అమలులో ఉన్న టారిఫ్ ప్రకారం 500 వాట్స్ కి రూ.1000, 1000 వాట్స్ కి రూ.2250, 1500 వాట్స్ కి రూ.3,000, 2000 వాట్స్ కి రూ.3,750, 2500 వాట్స్ కి రూ.4,550, 3000 వాట్స్ కి రూ.5,250, 3,500 వాట్స్ కి రూ.6,000, 4000 వాట్స్ కి రూ.6,750, 5000 వాట్స్ కి రూ.8,250, 6000 వాట్స్ కి రూ.9750, 10000 వాట్స్ కి రూ.15750 చొప్పున చెల్లించి తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లను తీసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ నిబంధనల మేరకు ఈ కనెక్షన్ల ద్వారా పది రోజులపాటు విద్యుత్తును వినియోగించుకోవచ్చని సీఎండీలు తెలిపారు. విద్యుత్ శాఖ సిబ్బంది మండపాల వద్ద అందుబాటులో ఉంటారని, ఏ ఇబ్బంది కలిగినా టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫోన్ చేయాలని వారు కోరారు.
ఆంక్షలు విరమించుకోవాలంటూ నాగబాబు కామెంట్లు..
వినాయక చవితి మండపాల విషయంలో ఆంక్షలు పెట్టి హిందూ యువకులను, ప్రజలను ఇబ్బంది పెట్టడం అంత మంచి పద్ధతి కాదని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. యూనిటీ ఫెస్టివల్ గా చేస్కునే ఈ పండుగలో ఆంక్షలు విధించడం ఏంటంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆంక్షలు విరమించుకోవాలని సూచించారు.
వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ పట్ల ప్రభుత్వం విధించిన ఆంక్షలు తక్షణమే విరమించుకోవాలి ! pic.twitter.com/wqXg5brGls
— Naga Babu Konidela (@NagaBabuOffl) August 29, 2022
ప్రత్యేక ఆంక్షలేమీ లేవు..!
ఏపీలో వినాయక చవితి వేడుకలకు నిబంధనలకు సంబంధించి డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి స్పందించారు. చవితి వేడుకలపై ప్రత్యేక ఆంక్షలు ఏమిలేవన్నారు. భద్రత దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే వారు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా నిబంధనలకు అనుగుణంగా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లకు అనుమతి ఉంటుందని డీజీపీ స్పష్టం చేశారు.