PM Modi AP Tour Update: మే 2న అమరావతికి ప్రధాని మోదీ, లక్ష కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు శ్రీకారం
PM Modi AP Tour Update: ప్రధాని మోదీ మే 2న ఏపీ రాజధాని అమరావతికి రానున్నారు. అమరావతి పునర్ నిర్మాణ పనులతో పాటు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

అమరావతి: భారత ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీన ఏపీ పర్యటనకు రానున్నారు. ఎల్లుండి అమరావతికి రానున్న ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు ప్రారంభం, శంకుస్థాపన చేయనున్నారు. అందుకు సంబంధిన వివరాలు ఇలా ఉన్నాయి. అమరావతి పునఃప్రారంభ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దాదాపు రూ.49,040 కోట్ల అమరావతి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నాని అధికారులు తెలిపారు.
ఏపీలో శాశ్వత సచివాలయం, రాష్ట్ర అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తారు. వాటితో పాటు రాష్ట్ర ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాలకు సైతం ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఆలిండియా సర్వీసెస్ అధికారుల నివాస సముదాయానికి శంకుస్థాపన చేస్తారు. దాదాపు రూ.57,962 కోట్ల కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభాలు చేయనున్నారు.
నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు విశాఖలో యూనిటీ మాల్‌కు శంకుస్థాపన, రూ.3,680 కోట్ల నేషనల్ హైవే పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. వీటితో పాటు ఖాజీపేట–విజయవాడ 3వ లైన్ ప్రారంభం, గుంటూరు–గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా ప్రారంభోత్సవం చేయనున్నారు.
ప్రధాన మోడీ అమరావతికి వచ్చేస్తున్నారు. మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చెయ్యబోతున్నారు. ఈ సందర్భంగా విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తెచ్చారు ఏపీ పోలీసులు. ఎవరు ఏ రూట్‌లో వెళ్ళాలి అనే అంశంపై ఏపీ డీజీపీ కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్
- ప్రధాని 2వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
- అక్కడి నుంచి హెలికాప్టర్ లో అమరావతిలోని హెలిప్యాడ్‌కు ఆయన చేరతారు. మొదట అనుకున్నా పహల్గాం ఉగ్రదాడి కారణంగా రోడ్డు షో రద్దు చేశారు.
- 3.45 గంటల నుంచి 4 వరకు అమరావతి పెవిలియన్ ప్రధాని మోదీ సందర్శిస్తారు.
- సాయంత్రం 5 గంటల వరకు సభ జరుగుతుంది. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన చేసి అనంతరం సభలో పాల్గొంటారు.
- 5.10 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
- 5.20కి గన్నవరం నుంచి బయల్దేరి ప్రధాని మోదీ ఢిల్లీ వెళతారు.
మే 2 న విజయవాడపై నుంచి వెళ్లే వాహనాల దారి మళ్ళింపు ఇలా..!
ప్రధాని పర్యటన నేపథ్యంలో మే 2, 2025న ఉదయం 5:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు విజయవాడ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలులోకి వస్తాయి.
ట్రాఫిక్ మళ్లింపులు
1. చెన్నై వైపు నుంచి విశాఖకు విజయవాడ మీదుగా, ఇబ్రహీంపట్నం, నందిగామ వైపు వెళ్లే భారీ గూడ్స్ వాహనాలని దారిమళ్లిస్తారు. వీటని త్రోవగుంట నుంచి చీరాల- బాపట్ల, రేపల్లె - అవనిగడ్డ, పామర్రు గుడివాడ హనుమాన్ జంక్షన్ మీదుగా ఇబ్రహీంపట్నం వైపునకు మళ్లిస్తారు. విశాఖపట్నం నుంచి చెన్నైవైపు వాహనాలు కూడా అలానే వస్తాయి.
2. చిలకలూరిపేట వైపు నుంచి విశాఖవెళ్ళే వాహనాలను చిలకలూరిపేట నుంచి NH-16 మీదుగా పెదనందిపాడు, కాకుమాను, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు నుంచి పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖ వైపు మళ్లిస్తున్నారు.
3. చెన్నై నుంచి విశాఖ వెళ్ళే వాహనాలను బోయపాలెం క్రాస్ వద్ద నుంచి ఉన్నవ గ్రామం, ఏ.బి.పాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి వంతెన మీదుగా అవనిగడ్డ, పామర్రు, గుడివాడ- హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖ వైపు మళ్లిస్తున్నారు.
4. గుంటూరు నుంచి విశాఖ వైపు వెళ్ళే వాహనాలను బుడంపాడు క్రాస్ మీదుగా తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుముడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు, గుడివాడ - హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖ వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు
5. గన్నవరం వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు ఆగిరిపల్లి - శోభనాపురం గణపవరం మీదుగా వెళ్లాలి. మైలవరం జి. కొండూరు ఇబ్రహీంపట్నం మీదుగా దారి మళ్లిస్తున్నారు.
6. విశాఖ సిటీ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు, మైలవరం జి. కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు వెళ్లాలి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చే వాహనాలు కూడా ఇదే రూట్ లో వెళ్తాయి.






















