NTR Smriti Vanam: తెలుగు వైభవంగా ఎన్టీఆర్ స్మృతివనం, అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ వంతెనపై సీఎం సమీక్ష
Andhra Pradesh News | తెలుగు సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, కళలు ఉట్టిపడేలా ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టు ఉండాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కలగలిపి తెలుగు వైభవంగా అమరావతిలో ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, భాష, సాహిత్యం, కళలు, ప్రాచీన చరిత్ర తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోవాలని ఆయన సూచించారు.
నీరుకొండ వద్ద అల్లూరి, పొట్టి శ్రీరాములు విగ్రహాలు
తన క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై సీఎం చంద్రబాబు శనివారం సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని నీరుకొండ వద్ద చేపట్టబోయే ఈ ప్రాజెక్టు అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంలో, ప్రాచీన తెలుగు చరిత్రతో పాటు ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అల్లూరి సీతారామరాజు, పొట్టిశ్రీరాములు వంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అలాగే తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, భాష, లిపి వంటి అంశాలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించారు.
ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహం..
తెలుగు ప్రజల ప్రతీకగా నిలిచే రాజధాని అమరావతిని కూడా ఈ ప్రాజెక్టులో ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. 182 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహం స్మృతి వనం ప్రాజెక్టుకు అనుబంధంగా నీరుకొండ రిజర్వాయర్‌ను తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందించాలని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకించి, పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించే విధంగా వివిధ వినోద, సాంస్కృతిక ఆకర్షణలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా, గుజరాత్‌లో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించబోయే ఐకానిక్ వంతెన డిజైన్లను కూడా సీఎం సమీక్షించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అంతకముందు, ఎన్టీఆర్ విగ్రహ నమూనాలను ఆయన పరిశీలించారు.






















