Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి బాలకృష్ణ శంకుస్థాపన, డిజైన్ చూశారా
Basavatarakam Cancer Hospital in Amaravati | ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించాలని నిర్ణయించిన బాలకృష్ణ బుధవారం ఉదయం శంకుస్థాపన, భూమి పూజ చేశారు.

Nandamuri Balakrishna | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ (Basavatarakam Cancer Hospital ) నిర్మాణానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏపీ రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ ఏర్పాటు చర్యలు చేపట్టింది. బుధవారం ఉదయం అమరావతిలోని తుళ్లూరులో సర్వే నెంబర్ 370, 371లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి సంస్థ చైర్మన్, నటుడు బాలకృష్ణ భూమి పూజ నిర్వహించారు.
అమరావతిలో 21 ఎకరాల్లో ఆధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్
ఏపీ రాజధాని అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో సమగ్ర క్యాన్సర్ చికిత్స, పరిశోధన కోసం అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్‌ను నందమూరి బాలకృష్ణ ప్రారంభించనున్నారు. ఈ క్యాంపస్‌లో ఎక్స్‌లెన్సీ సెంటర్ ఏర్పాటుచేసి, తొలి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృత శ్రేణి ఆంకాలజీ సేవలను అందిస్తారు. రూ.750 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చనున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ను ఏపీలో ఏర్పాటు చేస్తున్నందుకు ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణకి ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీలోనూ సేవలు విస్తరించాలని అమరావతిలో క్యాన్సర్ సెంటర్
వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స వంటి అన్ని దశలను సమగ్రంగా కలిపిన ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్ ప్రకారం ఏర్పాట్లు జరుగుతాయి. 2028 నాటికి శస్త్రచికిత్సలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో పడకల సంఖ్యను వెయ్యికి పెంచి, ప్రత్యేక విభాగాలు, పరిశోధనా విభాగాలను ఏర్పాటు చేస్తారు. క్లిష్టమైన, అధునాతన క్యాన్సర్ కేసుల చికిత్సకు ఈ క్యాంపస్‌ను ప్రాంతీయ రిఫరల్ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రులు పి నారాయణ, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, మాదిగ సంక్షేమ సహకార కార్పొరేషన్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి, తదితరులు హాజరయ్యారు.

హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ తొలిసారి 2014 ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు నియోజకవర్గంపై ఫోకస్ చేశారు. దాంతో 2019, 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాలకృష్ణకు ప్రజలు విజయాన్ని అందించారు. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణను పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది.






















